ప్రైవేటుకు ‘సంజీవని’.. సర్కారు వైద్యానికి సమాధి | Cabinet approves implementation of Sanjeevani program across the state | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకు ‘సంజీవని’.. సర్కారు వైద్యానికి సమాధి

Jul 3 2026 4:14 AM | Updated on Jul 3 2026 4:40 AM

Cabinet approves implementation of Sanjeevani program across the state

రూ.వందల కోట్ల ప్రజాధనం ధారబోస్తున్న చంద్రబాబు ప్రభుత్వం   

కర్ణాటకలో విఫల ప్రోగ్రామ్‌నే సంజీవని పేరుతో ఏపీ ప్రజల నెత్తిన

గేమ్‌ చేంజర్‌ అంటూ ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి   

రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు మంత్రివర్గం ఆమోదం   

ఈ ప్రోగ్రామ్‌లో గేట్స్‌ ఫౌండేషనూ భాగస్వామి.. తొలి ఏడాది రూ.149 కోట్లు.. తర్వాతి ఏడాది నుంచి రూ.55.5 కోట్లు ఖర్చు 

నాడు ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్‌క్లినిక్, టెలిమెడిసిన్‌ వంటి కార్యక్రమాలతో ప్రివెంటివ్‌ కేర్‌ బలోపేతం

సాక్షి, అమరావతి: సర్కారు వైద్యానికి చంద్రబాబు సమాధి కడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగ­స్వామ్యం (పీపీపీ) మోజులో ప్రైవేటుకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారు. ఇప్పటికే రెండేళ్లలో గత ప్రభు­త్వం అభివృద్ధి చేసిన వైద్యవనరులను నిర్వీ­ర్యం చేసిన చంద్రబాబు తాజాగా పక్క రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైన కార్యక్రమాలను ఏపీ ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. గతేడాది జూలైలో ప్రైవేట్‌ భాగస్వామ్యంతో తన సొంత జిల్లా చిత్తూరులో ప్రారంభించిన సంజీవని కార్యక్రమంలో గతంలో కర్ణాటకలో విఫలమైన ప్రోగ్రామే. త్వరలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ఇటీవల క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. 

ఇందుకోసం మొదటి ఏడాది రూ.149 కోట్లు, తర్వాతి ఏడాది నుంచి రూ.55.5 కోట్లు వెచ్చించబోతున్నట్టు ప్రకటించింది.  ఇప్పటికే కుప్పం, చిత్తూరు జిల్లాల్లో పైల­ట్‌ కార్యక్రమం కోసం రూ.10 కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చుచేసింది. 2029 నాటికి ఏకంగా రూ.260 కోట్ల మేర ప్రైవేట్‌ సంస్థకు దోచిపెట్టేందుకే నీకింత–నాకింత సూత్రంతో ఈ విఫల ప్రాజెక్టును చంద్రబాబు ఏపీ ప్రజల నెత్తిన రుద్దుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.  

వద్దని విరమించుకున్న కన్నడ సర్కార్‌ 
పొరుగున ఉన్న కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో ప్రైవేట్‌ భాగస్వామ్యంతో 2017లో ‘డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌’ (డీఐఎన్‌సీ(డింక్‌) కార్యక్రమాన్ని సిద్ధరామయ్య సర్కారు మొదలు పెట్టింది. తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేసింది. అయితే ఆ కార్యక్రమం ఘోరంగా విఫలం కావడంతో అప్పటి ప్రభుత్వం అడుగు ముందుకేయలేకపోయింది. 

ఇదే సందర్భంలో దేశంలో డిజిటల్‌ వైద్య సేవలను బలోపేతం చేస్తూ ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌(ఏబీడీఎం), ఈ–సంజీవని వంటి కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఒక ప్రత్యేక నెట్‌వర్క్‌ను నడపడం కంటే, కేంద్రం అందించే నిధులతో ప్రభుత్వ రంగంలోనే ఆరోగ్య సేవలను అభివృద్ధి చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిని సంజీవని అంటూ మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం వైద్యవర్గాలనే విస్మయపరుస్తోంది. 

గత ప్రభుత్వం నుంచే అమలు 
వాస్తవానికి సంజీవని కార్యక్రమం గతంలో వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రభుత్వ రంగంలోనే దిగ్విజయంగా అమలైన కార్యక్రమమే. అప్పట్లో టెలీ మెడిసిన్‌ ద్వారా రోగులకు స్పెషలిస్ట్‌ వైద్యుల కన్సల్టేషన్‌ సేవలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రారంభించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికే రాష్ట్రంలోని 85 శాతం మేర పౌరులకు ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ హెల్త్‌ అకౌంట్లు (ఆభా) రూపొందించారు. అంతేకాకుండా పౌరులందరికీ స్క్రీనింగ్‌ చేసి, ఆరోగ్య వివరాలను డిజిటల్‌ హెల్త్‌ అకౌంట్స్‌లో నిక్షి­ప్తం చేశారు. 

ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడంలో భాగంగా పథకం కింద పొందిన చికిత్సల వివరాలన్నింటినీ కూడా డిజిటలైజ్‌  చేశారు. ఏబీడీఎం, టెలీ మెడిసిన్‌ సేవల కల్పనలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచి అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ కితాబు పొందింది. మిగిలిన రాష్ట్రాలన్నింటికీ ఏపీ ఆదర్శం అంటూ పలు సందర్భాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇలా 2024 నాటికే ఎంతో కీలకమైన ప్రీవెంటివ్‌ కేర్‌లో గ్రామ స్థాయిలో సమర్థ వ్యవస్థ ప్రభుత్వ రంగంలో ఉంది. దీనంతటిని నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు పీపీపీ పేరిట విఫలమైన కార్యక్రమాన్ని మళ్లీ భుజానికి ఎత్తుకోవడం గమనార్హం.   

ప్రజల సమాచార గోప్యతకు ముప్పు 
 ఏబీడీఎం కార్యక్రమాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రజల ఆరోగ్య భద్రత, వ్యక్తిగత వివరాలు, గోప్యతకు ఏ మాత్రం భంగం వాటిల్లకుండా నేషనల్‌ హెల్త్‌ అథారిటీ(ఎన్‌హెచ్‌ఏ) అత్యంత సేఫ్‌ అండ్‌ సెక్యూర్‌గా సాఫ్ట్‌వేర్‌లను రూపొందించి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇంతటి పటిష్టమైన వ్యవస్థను కాదని సంజీవని పేరిట ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో రాష్ట్ర ప్రజల డేటాను  చంద్రబాబు పెడుతున్నారు.  ఇది  ప్రజల ఆరోగ్య భద్రత, వ్యక్తిగత గోప్యతకు అత్యంత ముప్పు తెచ్చే అంశమని వైద్య వర్గాల్లో చర్చ నడుస్తోంది.  

చిన్నారులపై వికృత లైంగిక దాడులకు సంబంధించిన ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న మైక్రోసాఫ్ట్‌ అధ్యక్షుడు బిల్‌గేట్స్‌కు చెందిన గేట్స్‌ ఫౌండేషన్‌ కూడా బాబు సంజీవని కార్యక్రమంలో భాగస్వామిగా ఉంది. ఈ క్రమంలో బిల్‌గేట్స్‌ను ఈఏడాది ఫిబ్రవరి నెలలో రాష్ట్రానికి పిలిపించి చంద్రబాబు హడావుడి చేశారు.  వాస్తవానికి హెల్త్‌కేర్‌ రంగంలో టెలీ కన్సల్టేషన్‌లు, ఇతర డిజిటల్‌ హెల్త్‌ సేవలు అందిస్తున్న ప్రైవేట్‌ సంస్థలు సైతం ఎన్‌హెచ్‌ఏతో కలిసి పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమే నేరుగా నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో భద్రత పరమైన ఇబ్బందులు తలెత్తవు,  దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏబీడీఎం అమలుకు జై కొడుతుంటే బాబు మాత్రం ప్రైవేట్‌పై మోజు చూపడం గమనార్హం.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలోనే మైల్‌ స్టోన్స్‌
» ప్రైవేట్‌ వ్యక్తుల ప్రమేయం లేకుండా దేశంలోనే అత్యంత సమర్థంగా డిజిటల్‌ హెల్త్, టెలి మెడిసిన్‌ సేవలను బలోపేతం చేస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గతంలోనే పలు చర్యలు తీసుకుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గిరిజన, మారుమూల గ్రామాలకు సైతం ప్రభుత్వ వైద్య సేవలను చేరువ చేస్తూ 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 విలేజ్‌ క్లినిక్స్‌ను నెలకొల్పింది. 

»  మరోవైపు స్మార్ట్‌ఫోన్‌ ఉన్నవారు ఈ సంజీవని (ఓపీడీ) యాప్‌ ద్వారా ఇంటి నుంచే వైద్య సేవలు పొందడానికి ఆస్కారం కల్పించారు. స్మార్ట్‌ఫోన్‌ లేనివారు ఆశా వర్కర్లు సహాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్రంలోని 42 వేల మంది ఆశా వర్కర్లకు నాటి ప్రభుత్వం స్మార్ట్‌ ఫోన్లు పంపిణీ చేసి, వాటన్నింటినీ హబ్‌లకు అనుసంధానించింది.  

» రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో 27 హబ్‌లను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ హబ్‌లకు 1,400కు పైగా పీహెచ్‌సీలు, 562 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 10,032 విలేజ్‌ క్లినిక్‌లను అనుసంధానించింది. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌ లాంటి స్పెషలిస్ట్‌ వైద్యులతో పాటు ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్ల సేవలు అందుబాటులో ఉంచింది. 

పీహెచ్‌సీ, విలేజ్‌ క్లినిక్‌కు వచ్చిన రోగులకు స్పెషా­లిటీ వైద్యుల సేవలు అవసరమైన సందర్భాల్లో టెలి మెడిసిన్‌ ద్వారా హబ్‌­లోని వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స అందించింది. హబ్‌లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్‌ ద్వారా రోగులతో మాట్లాడి ప్రిస్క్రిప్షన్‌ సూచించేవారు. పీహెచ్‌సీ, విలేజ్‌ క్లినిక్‌లోని వైద్య సిబ్బంది ఈ మందులను రోగులకు అందజేసే యంత్రాంగం అప్పట్లో పని చేసింది.  

» 2019 నుంచి 2023 డిసెంబర్‌ నాటికి దేశ వ్యాప్తంగా 18.3 కోట్ల టెలి కన్సల్టేషన్లు నమోదైతే, ఒక్క ఏపీ నుంచే అత్యధికంగా అందులో 25 శాతం అంటే 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. ఈ అంశాన్ని అప్పట్లో కేంద్ర ఆరోగ్య శాఖ పార్లమెంట్‌లో ప్రకటించింది.  

» 2019 నుంచి 2023 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలి కన్సల్టేషన్లు నమోదైతే ఒక్క ఏపీ నుంచే అత్యధికంగా 25 శాతం అంటే 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. ఈ అంశాన్ని అప్పట్లో కేంద్ర ఆరోగ్య శాఖ పార్లమెంట్‌లో ప్రకటించింది.   

» రూ.8500 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని వైఎస్‌ జగన్‌ చేపట్టారు. ఇవన్నీ ప్రభుత్వ రంగంలోనే పూర్తయి అందుబాటులోకి వస్తే అన్ని జిల్లాల్లో ప్రభుత్వ రంగంలో ఉచిత సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందేవి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement