ముద్దాపురంలో సంచలనం రేకెత్తించిన బీటెక్ విద్యార్థిని నాగహారిక మృతి ఘటన
హత్యచేసి నిప్పంటించారని అనుమానాలు
ఫోరెన్సిక్ రిపోర్టుతో కీలక మలుపు తిరిగిన వైనం
హత్యలో తండ్రి, సవతితల్లి పాత్రధారులా?
పోలీసుల అదుపులో ఆ ఇద్దరు!
పశ్చిమ గోదావరి జిల్లా: తణుకు మండలం ముద్దాపురంలో నిద్రిస్తున్న యువతి సజీవదహన మైన ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించగా తాజాగా కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగినట్లుగా సమాచారం. 2022లో జరిగిన ఈ ఘటనలో ముళ్లపూడి శ్రీను, రూప దంపతుల కుమార్తె నాగహారిక (19) తన గదిలోని మంచంపై సజీవదహనమైంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మృతిచెంది ఉండవచ్చని అప్పట్లో అనుమానాస్పద మృతిగా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే నాగహారిక అమ్మమ్మ, మేనమామలు మాత్రం ఇది ఖచ్చితంగా హత్యేనంటూ అప్పట్లో ఆరోపణలు చేయడంతోపాటు పోరాటం చేశారు. ఇటీవల కేసుకు సంబంధించి వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్టులో కీలకమైన ఆధారాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ముందుగా యువతి తల పగలగొట్టి ఆపై పెట్రోలుపోసి నిప్పంటించి హత్యచేసినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం. నాగహారిక తాడేపల్లిగూడెంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా సెలవులకు ఇంటికి వచ్చి మృతిచెందడం అప్పట్లో సంచలనంగా మారింది.
పోలీసుల అదుపులో నిందితులు?
యువతి సజీవ దహనం ఘటనకు సంబంధించి తాజాగా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. ముళ్లపూడి శ్రీనివాస్ మొదటి భార్య వసంత 2003లో మృతిచెందగా రూపను రెండవ వివాహం చేసుకున్నారు. మొదటి భార్య కుమార్తె అయిన నాగహారిక విషయంలో అప్పట్లో ఆస్తి వ్యవహారంలో తగాదాలు రావడంతోనే హత్య చేసి ఉంటారనే ఆరోపణలు ఏర్పడ్డాయి. ప్రధానంగా యువతి తండ్రి శ్రీనివాస్‌తోపాటు సవతి తల్లి రూపపై కూడా అప్పట్లోనే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నది వారినేనని, సూత్రదారులు, పాత్రధారులు కూడా వారేనని అని పలువురు అనుమానిస్తున్నారు.


