డమ్మీ పిస్టల్ చూపించి నగదు డిమాండ్ చేసిన కేసులో ముగ్గురి అరెస్ట్
రూ.40 వేల నగదు, ఎయిర్ పిస్టల్, నాటు తుపాకీ, కత్తి స్వాదీనం
పామూరు: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన ఓ ఆర్మీ ఉద్యోగి అప్పులపాలై తప్పుదారి పట్టాడు. డమ్మీ పిస్టల్ చూపించి నగదు డిమాండ్ చేసి చివరకు పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. అధికారులమని చెప్పి మార్కాపురం జిల్లా పామూరు సమీపంలోని జాతీయ రహదారిపై లారీలు, వాహనాలను ఆపి డమ్మీ పిస్టల్ చూపించి యజమానులు, డ్రైవర్లను బెదిరించి, కొట్టి నగదు వసూళ్లకు పాల్పడుతున్న కేసులో డబ్బుగొట్టు మల్లికార్జున, బర్రె చిట్టిబాబు, మచ్చ వంశీ అనే వారిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
సీఐ దుర్గాసి వినోద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12, 16 తేదీల్లో రాత్రివేళ వీరు హైవేపై వెళ్తున్న లారీలను ఆపి అధికారులమని చెప్పి పత్రాల తనిఖీ పేరుతో బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. కనిగిరి డీఎస్పీ శ్రీధర్ పర్యవేక్షణలో పామూరు ఎస్‌ఐ కట్టా అనూక్, సీఎస్‌పురం ఎస్‌ఐ పిచ్చాల వెంకటేశ్వరరెడ్డి నేతృత్వంలో రెండు బృందాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆదివారం మధ్యాహ్నం విరాట్‌నగర్ సెంటర్‌లో నిందితులను అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు.
నిందితుల్లో ఒకరైన మార్కొండాపురానికి చెందిన డబ్బుగొట్టు మల్లికార్జున అసోంలో ఆర్మీలో పనిచేస్తూ క్రికెట్ బెట్టింగుల్లో రూ.20 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. అక్రమంగా సొమ్ము సంపాదించి ఆ అప్పులు తీర్చాలన్న ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో ఒక ఎయిర్ పిస్టల్‌ను కొన్నాడు. ఈ నెల 12న స్వగ్రామంలో తన తాతయ్య కర్మకాండలకు సెలవుపై వచ్చిన మల్లికార్జున బొట్లగూడూరుకు చెందిన స్నేహితుడు బర్రె చిట్టిబా బును కలిసి పరిస్థితి వివరించాడు. మల్లికార్జున తన బంధువైన బలిజపాలెంకు చెందిన మచ్చ వంశీనీ కలుపుకొని తెలిసిన వ్యక్తి నుంచి కారును అద్దెకు తీసుకుని రాత్రిపూట హైవేపై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిందితుల నుంచి రూ.40 వేల నగదు, ఎయిర్ పిస్టల్, కత్తి, నాటుతుపాకీ స్వా«దీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.


