టన్నుకు మరో రూ. 11వేల పెంపు
ఆక్వా రైతుపై 8 నెలల్లో రూ. 27వేల భారం
కంపెనీలకే దన్నుగా నిలుస్తున్న చంద్రబాబు సర్కార్
ఇప్పటికే రెండు విడతల్లో టన్నుకు రూ.16 వేల పెంపు
తాజాగా పెంచిన రూ.11వేలు నేడో రేపో అమల్లోకి..
రైతుల ఏకాభిప్రాయం లేదు.. అప్సడా అనుమతి లేదు
రైతుల ఆమోదంతోనే ధరలు సవరించాలన్న హైకోర్టు సూచనలూ బేఖాతర్.. సీడ్ ధరలు, ఏరియేటర్లు, మోటార్లు, ఇతర పరికరాల ధరలూ భారీగా పెంపు
విద్యుత్ సబ్సిడీ హామీ అమలు కాకపోవడంతో అదనపు భారం.. వైరస్‌లు, తెగుళ్ల కంటే ప్రభుత్వ విధానాలే ఎక్కువ నష్టపరుస్తున్నాయంటున్న రైతులు
చంద్రబాబు సర్కార్ తీరుపై రాష్ట్రవ్యాప్త ఆందోళనకు రైతు సంఘాలు సిద్ధం
సాక్షి, అమరావతి: ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా) అనుమతి లేదు.. రొయ్య రైతుల ఏకాభిప్రాయం లేదు.. అసలు రైతుల అభిప్రాయాన్ని అడిగినవాడే లేడు. అయినా రొయ్య ఫీడ్ ధరలను టన్నుకు మరో రూ.11వేలకు పెంచడానికి రంగం సిద్ధమయ్యింది. నేడో రేపో పెంచిన ధరలను అమలు చేయబోతున్నారు. ఫీడ్ కంపెనీలు ఇప్పటికే రెండు విడతల్లో టన్నుకు రూ. 16వేలు పెంచాయి. ఇప్పుడు మరో రూ.11 వేలు. ఇలా 8 నెలల వ్యవధిలో టన్నుకు ఏకంగా రూ.27వేల మేర ఫీడ్ ధరలు పెరగడమంటే మాటలా.. తమ జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని రైతులు వాపోతున్నారు.
ఫీడ్ ధరలే కాదు, సీడ్ ధరలదీ అదే దారి. ఆక్వాసాగులో ఉపయోగించే పరికరాలదీ అదే దారి. ఎడాపెడా పెరుగుతున్న ధరలు రొయ్యరైతులను నిలువునా ముంచుతున్నాయి. ఆక్వాఫీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ చంద్రబాబు అనుయాయులవే. అందుకే వాళ్లు ఎలా కావాలంటే అలా వ్యవహారం నడుపుతున్నారు. సీడ్, ఫీడ్ ధరలను వాళ్లే నిర్ణయిస్తున్నారు. అష్టకష్టాలు పడి, అధికధరలను భరించి ఆక్వా సాగు చేసి రొయ్యపంట చేతికొచ్చేసరికి వ్యాపారులంతా సిండికేట్‌గా తయారయ్యి రేట్లు పడిపోయేలా చేస్తున్నారు. రైతులను ఆదుకోవలసిన చంద్రబాబు సర్కార్ ఈ సిండికేట్‌కు వంతపాడుతుండడాన్ని నిరసిస్తూ ఆక్వా రైతులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
ఏకాభిప్రాయం లేకుండా ఏకపక్షంగా పెంపు
ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్సడా చట్టంతో పాటు ఫీడ్, సీడ్ «చట్టాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రైతుల పక్షాన నిలవాల్సిన రాష్ట్రప్రభుత్వం ఫీడ్‌కంపెనీల అడుగులకు మడుగులొత్తడంతో అవి ఇష్టారాజ్యంగా ధరలను పెంచేస్తున్నాయి. రైతుల ఏకాభిప్రాయం లేకుండా ఏకపక్షంగా ఫిబ్రవరిలో రూ.4వేలు, జూన్‌లో రూ.12వేల చొప్పున పెంచేశాయి. రైతుల ఆందోళనలతో రూ.2వేలు తగ్గించినట్టు నాటకాలాడిన కంపెనీలు 15 రోజులు తిరక్కుండానే దొడ్డిదారిన రూ.2వేలు పెంచి ఆ మేరకు రైతులపై భారం మోపాయి. 45 రోజులకోసారి ధరలపెంపును సమీక్షించుకునేందుకు కంపెనీలకు అవకాశం కల్పించారు.
ప్రత్యేకంగా ఫీడ్ ధరల సమీక్ష కోసం రైతులు, ప్రాసెసింగ్, ఎగుమతిదారులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కమిటీలో ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్ నిర్వాహకులు సిఫార్సు చేసిన ప్రభుత్వ అనుకూల రైతులకే చోటు కల్పించారు. వీరు ఫీడ్ కంపెనీలకు వంతపాడడం మొదలు పెట్టారు. ఈ దశలో అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలను సాకుగా చూపి టన్నుకు రూ.37 వేలు తక్కువకాకుండా పెంచితే కానీ తమకు గిట్టుబాటు కాదని చెబుతూ కనీసం రూ.15 వేలు తక్కువకాకుండా పెంచేందుకు అనుమతినివ్వాలని ప్రతిపాదించాయి. ఈ మేరకు సబ్ కమిటీ ఆమోదం తెలపడంతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచే పెంపును అమలులోకి తీసుకొచ్చాయి. కంపెనీలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వతీరును నిరసిస్తూ ఆక్వారైతులు హైకోర్టును ఆశ్రయించారు.
రైతుల ఏకాభిప్రాయం లేకుండా ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడాన్ని హైకోర్టు సైతం తప్పుబట్టింది. రైతులతో చర్చించి, వారి ఆమోదంతోనే ధరలను సవరించాలని సూచించింది. అప్పటివరకు పెంపును నిలిపి వేస్తున్నట్టు ఆదేశాలిచ్చింది. తాజాగా సబ్ కమిటీ ఆమోదంతో దొడ్డిదారిన టన్నుకు రూ.11వేలు పెంచేందుకు సిద్ధపడ్డాయి. ఈ పెంపును ఒకటి రెండు రోజుల్లో అమలులోకి తీసుకువచ్చేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఫీడ్ ధరల సబ్ కమిటీలో సభ్యులైన రైతుప్రతినిధులు కంపెనీలు ప్రతిపాదించిన ధరల పెంపు విషయమై ఆక్వా సాగయ్యే జిల్లా సంఘాల నేతలతో కానీ, రాష్ట్ర రైతు సంఘాలతో కానీ చర్చించకుండా ఏకపక్షంగా ఆమోదం తెలపడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మేత ధరల భారమిలా
2024 ఏప్రిల్‌లో టన్నుకు వెనామీ రొయ్యల మేత ధర రూ.82 వేలు, టైగర్ రొయ్యల మేత రూ.92 వేల మధ్య ఉండగా ప్రస్తుతం వెనామీ మేత రూ.1.18 లక్షలకు, టైగర్ మేత రూ.1.34 లక్షలకు చేరింది. అంటే రెండున్నరేళ్లలో టన్నుకు వెనామీ రైతులపై రూ.36 వేలు, టైగర్ రైతులపై రూ.42 వేల మేర భారం పడినట్టవుతుంది. మేత ధరల భారంతో కిలో రొయ్యల ఉత్పత్తికి వెనామీకి రూ.300కు, టైగర్‌కు రూ.450 ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. ఫీడ్ ధరలను తరచూ పెంచే విధానాన్ని నిలిపివేయాలని ఆక్వా రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కంపెనీలు ఏడాది లేదా ఆరు నెలలకు సరిపడా ముడిసరుకులను ఒకేసారి ఇండెంట్ పెట్టి దిగుమతి చేసుకుంటాయే తప్ప నెలకోసారి దిగుమతి చేసుకోవని రైతు సంఘాలు చెబుతున్నాయి.
ప్రతీ ఏటా నవంబర్ లేదా డిసెంబర్‌లో ధరల సమీక్ష చేయాలే తప్ప ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రైతుల అంగీకారంలేకుండా, వారి అనుమతి తీసుకోకుండా ఇష్టానుసారం ధరలు పెంచుకుంటూ పోతే తాము ఎలా సాగు చేయగలమని ప్రశ్నిస్తున్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా ధరల పెంపుపై నియంత్రణ లేకపోవడం వల్ల పెట్టుబడి వ్యయం పెరిగిపోతోందని, అదేసమయంలో కౌంట్ ధరలు మాత్రం ఇష్టానుసారంగా కోతలు పెట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడుతున్నారు. నాణ్యమైన సీడ్ సరఫరా చేయని హేచరీలు, లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న హేచరీలపై చర్యలు తీసుకోకుండా వారికి ప్రభుత్వం వంతపాడడం సరికాదంటున్నారు.
ప్రాసెసింగ్ ప్లాంట్ల వద్ద రొయ్యల కొనుగోలు ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయని వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టుబడి ఆధారంగా కౌంట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిస్తూ దోపిడికి గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. మరొక వైపు ఆక్వాసాగులో ఉపయోగించే పరికరాల ధరలు కంపెనీలు ఇటీవలే భారీగా పెంచేశాయి. ఒక్కో ఏరియేటర్ సెట్‌పై రూ.3 వేలు, సాధారణ, ప్రీమియం మోటార్లపై రూ.1000కు పైగా పెంచారు. ఆక్వా రైతులకు సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్స్, మోటార్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది.
మేత ధరల పెంపును నిరసిస్తున్నాం
తాజాగా టన్నుకు రూ.11వేల మేర మేత ధరలు పెంచాలన్న ప్రతిపాదనలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే రెండు విడతల్లో రూ.16వేల మేర భారం మోపారు. మేత కంపెనీలు, ప్రాసెసింగ్ నిర్వాహకులకు సిఫార్సులతో కూటమి ప్రభుత్వం నియమించిన ఫీడ్ ధరల రైతుల సబ్ కమిటీ సభ్యులతీరు వల్లే మాకీ పరిస్థితి ఏర్పడింది. 45 రోజుల కోసారి ఫీడ్ ధరలు సమీక్షించే విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వతీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. – దుగ్గినేని గోపీనాథ్, కన్వీనర్, ఏపీ రొయ్య రైతుల సమాఖ్య
జగన్ హయాం.. ఆక్వా రైతుకు స్వర్ణయుగం..
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.309.95 కోట్ల బకాయిలను సైతం చెల్లించింది. అస్తవ్యస్తంగా ఉన్న ఆక్వా జోన్స్‌ను చక్కదిద్దింది. జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగుదారులందరికీ యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సబ్సిడీని వర్తింపచేసింది. ఆక్వాకు సంబందించిన విద్యుత్ సర్వీసుల్లో దాదాపు 90 శాతం కనెక్షన్లకు సబ్సిడీ విద్యుత్ సరఫరా చేయగా, దాదాపు 95 శాతం మంది రైతులు లబ్ధి పొందారు.
పాత బకాయిలతో సహా 2019–24 మధ్య ఐదేళ్లలో ఆక్వా సబ్సిడీ రూపంలో రూ.3804 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం భరించింది. పైగా ఆక్వా రైతులకు రక్షణ కోసం అప్సడా, ఏపీ ఫిష్ ఫీడ్, సీడ్ యాక్టులను తీసుకొచ్చింది. పెంచిన ఫిష్ ఫీడ్ ధరలను మూడు సార్లు కంపెనీలపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ ఉపసంహరింపచేయడంతో టన్నుపై రూ.8,600 మేర ఆదా అయ్యింది. పైగా 15 రోజులకోసారి రొయ్య ధరలను సమీక్షించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేశారు.
దొంగల్లా మేత కంపెనీలు
200 ఎకరాల్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆక్వా సాగు చేస్తున్నాం. మేత కంపెనీలు దొంగల్లా తయారయ్యారు. తాజా పెంపుదలతో 8 నెలల వ్యవధిలో ఏకంగా రూ.27వేలు పెంచినట్టవుతోంది. మరొక వైపు కౌంట్ ధరలకు సైతం ఎడాపెడా కోతలేస్తూ ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు రైతులను దోచుకుంటున్నారు. విద్యుత్ సబ్సిడీ వర్తించడం లేదు. ఓవర్ లోడ్ పేరిట ప్రతి నెలా రూ.12వేల వరకు అదనపు భారం పడుతోంది. జనరేటర్లతోనే ఆక్వా సాగు చేస్తే మేలన్నట్టుగా కన్పిస్తోంది. వైరస్‌లు, తెగుళ్ల కంటే చంద్రబాబు (సీబీ) వైరస్ వలనే ఆక్వా రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. – వేగేశ్న వెంకటరాజు, చిన్నకాపురం, పశ్చిమగోదావరి జిల్లా
ఎకరాకు రూ.72వేల అదనపు భారం
నేను 35 ఎకరాలు సాగు చేస్తున్నా. ఇప్పటికే టన్నుకు రూ.16వేల మేర పెంచిన కంపెనీలు తాజాగా మరో రూ.11వేల మేర పెంచనుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పెంపుతో ఎకరాకు రూ.72వేల మేర అదనంగా భారం పడుతోంది. కౌంట్ ధరల మధ్య వ్యత్యాసం రూ.30–50 నుంచి రూ.10–30కు తగ్గించేశారు. విద్యుత్ సబ్సిడీ వస్తుందని ఎదురు చూసాం. కానీ అమలుకు నోచుకోవడంలేదు. సర్దుబాటు చార్జీల పేరిట అదనపు భారం మోపుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆక్వా రైతుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. – అల్లూరి కృష్ణంరాజు, ఖాతాల మెరక, పశ్చిమగోదావరి జిల్లా
విద్యుత్ సబ్సిడీకీ ఎగనామం
జోన్, నాన్‌జోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ çసరఫరా చేస్తామంటూ ఇచ్చిన హామీని రెండున్నరేళ్లుగా అటకెక్కించేశారు. మరొక వైపు సర్‌చార్జీ, సర్దుబాటు చార్జీలంటూ ఎడాపెడా బాదడంతో యూనిట్ రూ.1.50కే విద్యుత్ పొందే రైతు భూతద్దం పెట్టి వెతికినా కన్పించని పరిస్థితి నెలకొంది. వైఎస్ జగన్ హయాంలో సబ్సిడీకి అర్హత పొందిన రైతులు తప్ప ఈ రెండున్నరేళ్లలో కొత్తగా ఏ ఒక్క రైతు ఈ రెండేళ్లలో విద్యుత్ సబ్సిడీ పొందలేని దుస్థితి నెలకొంది.
సబ్సిడీ పొందే రైతులు సైతం అదనపు చార్జీల పేరిట యూనిట్ రూ.2.50కుపైగా చెల్లిస్తున్నారు. అదే సబ్సిడీ వర్తించని రైతులకు వాస్తవంగా యూనిట్ రూ.3.85 పైసలకే విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, యూనిట్‌కు రూ.5కు తక్కువ కాకుండా బిల్లులొస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవర్ లోడ్, అదనపు ఛార్జీల పేరిట ఒక్కో సర్వీసుకు రూ.8వేల నుంచి రూ.12వేల వరకు అదనపు భారం పడుతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.


