
తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులను స్థానికేతరులుగా పరిగణించడంపై హైకోర్టు విస్మయం
ఏపీలో పుట్టిపెరిగిన విద్యార్థులను స్థానికులుగానే చూడాలని తీర్పు
ఫలితంగా ఈఏపీసెట్ రెండో దశ కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు నిలుపుదల
ఇప్పటికే తొలిదశ సీట్ల కేటాయింపు పూర్తవగా.. కోర్టు ఆదేశాలతో మల్లగుల్లాలు
తొలిదశ కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపును కొత్తగా చేపట్టాలంటున్న విద్యావేత్తలు
పీజీఈసెట్ సీట్ల కేటాయింపునకు బ్రేక్
ఈసెట్, ఐసెట్ సీట్ల కేటాయింపుపై మార్పులుంటాయా?
‘స్థానిక’ సర్దుబాటు ఎలా చేస్తారని మీమాంస
సాక్షి, అమరావతి: విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. అనాలోచిత నిర్ణయాలు, చట్టబద్ధత లేని జీవోలతో వారి బంగారు భవిష్యత్తును బలిచేస్తోంది. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల వేళ ‘స్థానికత’ను సవరించి ఇచ్చిన జీవోలను న్యాయస్థానం తోసిపుచ్చడంతో ప్రభుత్వ పరిపాలనలో డొల్లతనం బయటపడింది. ఫలితంగా ఇంజినీరింగ్‌తో పాటు ఐసెట్, ఈసెట్ కౌన్సెలింగ్‌లలో సీట్లు పొందిన లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంలో పడింది. తెలంగాణలో ఇంటర్మీడియెట్ చదివి.. ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన ఏపీ విద్యార్థులను స్థానికేతరులుగా (అన్‌రిజర్వ్‌డ్) మాత్రమే గుర్తిస్తూ తొలి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏపీలో పుట్టి పెరిగి, ఇక్కడే కుటుంబం నివాసం ఉంటున్నప్పుడు ఆ విద్యార్థులను ‘స్థానికులు’గా పరిగణించాలని తాజాగా తీర్పునిచ్చింది. దీంతో కంగుతిన్న ప్రభుత్వం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే అర్ధంతరంగా ఈఏపీసెట్ రెండో దశ సీట్ల కేటాయింపుతో పాటు ఏపీ పీజీఈసెట్ (ఎంటెక్) సీట్ల కేటాయింపును నిలిపివేసింది.
విద్యార్థులకు న్యాయం జరిగేనా?
జీవోల ప్రకారం విద్యాసంస్థల్లో స్థానికత కోటాలో 85 శాతం, స్థానికేతర (అన్‌రిజర్వ్‌డ్) కోటాలో 15 శాతం సీట్లు భర్తీకి అవకాశం కల్పించింది. అయితే, 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు నాలుగేళ్లు ఏపీలో చదివి.. ఇక్కడి స్థానికత ఉన్న విద్యార్థులను మాత్రమే స్థానిక కోటాలో సీట్లు కేటాయించింది. ఒక్క ఏడాది బయట చదివిన విద్యార్థులను స్థానికేతర కోటాలోకి నెట్టేసింది. ఫలితంగా ఈఏపీసెట్‌లో ర్యాంకు సాధించినప్పటికీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కోల్పోయారు. పైగా స్థానికేతర కోటా కావడంతో మంచి కళాశాలలో సీటు దక్కలేదు.
ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇప్పటికే ఈఏపీసెట్ తొలి దశలో 1.18 లక్షల మందికి కనీ్వనర్ కోటాలో సీట్లు కేటాయింపు పూర్తయింది. న్యాయస్థానం తీర్పును అనుసరించి విద్యార్థులకు న్యాయం చేయాలంటే తొలి దశ కౌన్సెలింగ్‌లో మార్పు చేయాల్సి వస్తుంది. ఇదే జరిగితే విద్యార్థుల సీట్లలో భారీ మార్పులు తప్పని పరిస్థితి. అలా కాకుండా రెండో దశలో మాత్రమే అవకాశం కల్పిస్తామంటే.. తొలిదశలో మెరుగైన కళాశాలలో సీటు వచ్చే అవకాశాన్ని కోల్పోయినట్టే అవుతుంది.
ఉదాహరణకు.. ఒక విద్యార్థికి స్థానిక కోటా కిందకి వస్తే ఎక్స్ అనే కళాశాలలో సీటు వస్తుందనుకుంటే.. తొలిదశలో ఆ కళాశాలలో అన్ని సీట్లు భర్తీ అయిపోతే.. రెండో కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పిస్తామంటే అక్కడ సీటు వచ్చే వీలు ఉండదు. పోనీ, విద్యార్థి కోరుకున్న కళాశాలకు నేరుగా సీటును మార్పు చేయడం కూడా నిబంధనలకు విరుద్ధం. పైగా కేవలం కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్న విద్యార్థులకే స్థానిక కోటాను వర్తింపజేస్తే.. మిగిలిన విద్యార్థులకు అన్యాయం చేసినట్టే. ఇంత గందరగోళం మధ్య ఏం చేయాలో తెలియన ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇది ఒక్క ఈఏపీసెట్‌కే కాకుండా ఇప్పటికే సీట్లు కేటాయింపు పూర్తయి తరగతులు ప్రారంభమైన ఐసెట్, ఈసెట్ విద్యార్థులకూ వర్తిస్తుంది. ఇలా ఏపీకి చెందిన విద్యార్థులు స్థానికేతర కోటా సీట్లు పొందితే వారికి ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది.
ముందే హెచ్చరించిన ‘సాక్షి’..
కూటమి ప్రభుత్వం విద్యాసంస్థల్లో స్థానికత మార్పు రాజ్యాంగానికి విరుద్ధంగా చేసిందంటూ ‘రాజ్యాంగ రక్షణలేని స్థానికత’ శీర్షికన తో మే 21 హెచ్చరించింది. పునర్విభజన చట్టం ప్రకారం గతేడాది పదేళ్ల గడువు ముగిసింది. దీనిని ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. వాస్తవానికి స్థానికత మార్పు అనేది ప్రభుత్వ ప్రధాన అజెండాగా ఉండాలి. దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు అనుసరించేలా కామన్ ఆర్డర్‌ను తీసుకురావాలి. కానీ, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.
ప్రవేశాలకు సమయం దగ్గర పడిన సమయంలో హడావుడిగా ఉన్నత విద్యాశాఖ ద్వారా వివిధ సెట్స్ నిర్వహణ కోసం పాత జీవోలను సవరిస్తూ స్థానికతను ఖరారు చేసింది. రాజ్యాంగంలో ఆరి్టకల్ 371డీ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా పొందుపరిచిన అంశాలను రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మార్పు చేయాలని, అప్పటివరకు ఆ అంశాలు ఉనికిలోనే ఉంటాయని రాజ్యాంగ నిపుణుల హెచ్చరికలను కూడా పట్టించుకోలేదు. వీటిని అనుసరించే హెల్త్ యూనివర్సిటీ, వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలతో పాటు స్పెషల్ యూనివర్సిటీలు కూడా ఉత్తర్వులు ఇచ్చాయి. ఈ వర్సిటీల్లో కౌన్సెలింగ్ పూర్తయి స్థానికేతర కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ఏవిధంగా న్యాయం చేస్తారో వేచిచూడాలి.
ఏం చేసినా లాభం లేదా?
ఏపీ విద్యార్థులు తెలంగాణలో ఇంటర్మీడియెట్ చదివినప్పటికీ.. ఉన్నత విద్య ప్రవేశాలల్లో స్థానికులుగా గుర్తించాలని ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, ఏపీ హెల్త్ యూనివర్సిటీ కేసులో స్థానికతపై హైకోర్టు డివిజినల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఆధారంగానే సింగిల్ బెంచ్ ధర్మాసనం తాజాగా ఈఏపీ సెట్‌లో విద్యార్థులకు స్థానికత కల్పించాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ప్రభుత్వం సవాల్ చేసినా నిలబడే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం ఉండదంటున్నారు.
తెలంగాణ హైకోర్టు సైతం అక్కడ హెల్త్ యూనివర్సిటీ కేసులో ఆ రాష్ట్రానికి వెలుపల చదివిన విద్యార్థులను కూడా స్థానికులుగా గుర్తించాలని ఇచ్చిన తీర్పును.. అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కానీ, సుప్రీం ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లితే తెలంగాణకు వర్తించిన తీర్పే ఇక్కడా వర్తిస్తుందని చెబుతున్నారు. ఇలా అన్నిదారులు మూసుకుపోవడంతో కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా స్థానిక కోటాను కల్పించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.