హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ | AP High Court Serious Attack On Ambati Rambabu House | Sakshi
Sakshi News home page

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్

Feb 1 2026 6:29 PM | Updated on Feb 1 2026 6:51 PM

AP High Court Serious Attack On Ambati Rambabu House

సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో చంద్రబాబు సర్కార్‌కు షాక్ తగిలింది. వైఎస్సార్‌సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్‌ అయ్యింది. శాంతిభద్రతలు అదుపులోకి వచ్చేంతవరకూ అంబటి ఫ్యామిలీకి 24 గంటల భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి నిన్న (శనివారం) హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

తనతోపాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆమె అందులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, శాంతి­భద్రతల సమస్య ఉందని పిటిషన్‌లో వివరించారు. తనకు 24 గంటలు భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి కోరారు. ఇవాళ (ఫిబ్రవరి 1, ఆదివారం) హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా, టీడీపీ గూండాలు బహిరంగంగా ఆయుధాలు చేతబట్టి అంబటి రాంబాబుపై శనివారం హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కర్రలు, రాడ్లు, కోడిగుడ్లతో దాడి చేస్తూ అంబటి ఇంటి వద్ద టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. కార్యాలయంలోనూ విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. తుదకు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కుట్ర బెడిసి కొట్టడంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు పాలకులు బరి తెగించారు.

ఈ క్రమంలో వందలాది మంది పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి ఇంటిపై దాడికి దిగినా వారు చోద్యం చూస్తూ మిన్నకుండి పోవడం విస్తుగొలుపుతోంది. వందల మంది రౌడీలు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటిపైకి దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయనపైనా దాడి చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఒక పథకం ప్రకారం అంబటి రాంబాబును భౌతికంగా నిర్మూలించాలన్న తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా గూండాలను పంపించి ఆయనపై ఉదయం నుంచి దాడి చేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement