సాయి కృష్ణ కేసులో మరో సంచలన మలుపు! | Another Big Twist In Sai Krishna Lockup Death Case, Mother Alleges Custodial Death And Destruction Of Evidence | Sakshi
Sakshi News home page

సాయి కృష్ణ కేసులో మరో సంచలన మలుపు!

Jun 24 2026 8:37 AM | Updated on Jun 24 2026 10:28 AM

Another Big Twist In Sai Krishna Case

సాక్షి, విజయవాడ: సంచలనం రేపిన సాయి కృష్ణ మిస్సింగ్‌ కేసు.. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడు.. కృష్ణలంక సీఐ(సస్పెండెడ్‌) నాగరాజు అధికారులు ఐదు గంటలపాటు ప్రశ్నించినా మౌనం వహించినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టుకు సిట్‌ ఎలాంటి సమగ్ర దర్యాప్తు నివేదికను సమర్పిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు కాపీ వెలుగులోకి రావడం మరింత కలకలం రేపుతోంది. 

ఇన్నాళ్లూ “సాయి కృష్ణ ఎక్కడ?” అన్న ప్రశ్న చుట్టూ తిరిగిన వ్యవహారం ఇప్పుడు “సాయి కృష్ణ బతికే లేడు” అనే విషయాన్ని ధృవీకరించే దిశగా వెళ్తోంది. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, అనంతరం ఆధారాలు లేకుండా శవాన్ని తగులబెట్టారని ఆరోపిస్తూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు కాపీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఫిర్యాదులో ఏముంది?
ఈ నెల 19వ తేదీన సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడు సాయి కృష్ణను మే నెల మొదటి వారంలో పెండింగ్‌లో ఉన్న నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (NBW) కేసు పేరుతో కృష్ణలంక, మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించారని, కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు.

దండ రెడీ చేసుకో..
విజయలక్ష్మి చేసిన ఫిర్యాదులో సీఐ నాగరాజుపై సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చిన తర్వాత సీఐ నాగరాజు తనతో “నీ కొడుకుని చంపేస్తాం.. దండ రెడీ చేసుకో” అని చెప్పారని విజయలక్ష్మి ఆరోపించారు. అలాగే లాకప్‌లో సాయి కృష్ణను తీవ్రంగా కొడుతున్న సమయంలో అతడి అరుపులు, కేకలు తాను స్వయంగా విన్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడిని తనతో పంపించాలని కోరగా.. సీఐ నాగరాజు తనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.

అందుకే హైకోర్టుకు.. 
సాయి కృష్ణ ఆచూకీ లభించకపోవడంతో తన కుమార్తె ద్వారా హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు విజయలక్ష్మి తన ఫిర్యాదులో వివరించారు. అయితే అప్పటికే సాయి కృష్ణ మరణించాడని, ఆ విషయం బయటపడితే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో అతడి మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా తగులబెట్టారని ఆరోపించారు. తన కొడుకును కిరాతకంగా చంపిన నాగరాజును కఠినంగా శిక్షించాల్సిందేనని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐ నాగరాజుపై అక్రమ నిర్బంధం, ఆధారాలను నాశనం చేయడం, హత్యాయత్నం తదితర అభియోగాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

విచారణలో నాగరాజు ఏమైనా కీలక విషయాలు వెల్లడించాడా? సాయి కృష్ణ ఆచూకీపై స్పష్టత ఇచ్చాడా? ఎవరు చెబితే ఇదంతా చేశాడు?.. సీసీటీవీ పుటేజీ ఎందుకు మాయం చేశాడు?.. అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో నాగరాజుకు రాజకీయ భవిష్యత్తుపై హామీలు ఇచ్చారని, అందుకే విచారణలో పూర్తిగా నోరు విప్పడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement