ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు | Andhra Pradesh High Court On Cheating in name of jobs | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు

Feb 17 2022 5:32 AM | Updated on Feb 17 2022 5:32 AM

Andhra Pradesh High Court On Cheating in name of jobs - Sakshi

సాక్షి, అమరావతి: హైకోర్టు పేరుతో తప్పుడు లెటర్‌ప్యాడ్‌లు సృష్టించి కొందరు వ్యక్తులు వాట్సాప్‌లో సర్క్యులేట్‌ చేస్తూ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారని, ఉద్యోగార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు హెచ్చరించింది. ఉద్యోగాల భర్తీపై వచ్చే తప్పుడు నోటిఫికేషన్లను, లెటర్లను తమ దృష్టికి తీసుకురావాలని కోరింది. తప్పుడు వాట్సాప్‌ సందేశాలు, నకిలీ నోటిఫికేషన్లను వ్యాప్తి చేసే వారిని ప్రాసిక్యూట్‌ చేస్తామని హెచ్చరించింది. తప్పుడు హైకోర్టు లెటర్‌ ప్యాడ్‌ తయారు చేసి, హైకోర్టు రిజిస్ట్రార్‌ (రిక్రూట్‌మెంట్‌) సంతకాన్ని స్కాన్‌ చేసి క్లర్క్‌ ఉద్యోగాలంటూ వాట్సాప్‌లో వ్యాప్తి చేస్తున్న వ్యవహారంపై హైకోర్టు చర్యలు చేపట్టింది. తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ తప్పుడు సందేశాల వ్యాప్తి వెనుకున్న కుట్రదారులను, నేరస్తులను చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులను కోరింది. ఉద్యోగ ఆశావహులు, ఇతరులు కూడా హైకోర్టు భర్తీ చేసే ఉద్యోగాల విషయంలో హైకోర్టు వెబ్‌సైట్‌ను మాత్రమే చూడాలని కోరింది. ఉద్యోగ ప్రకటన మొదలు, భర్తీ వరకు ప్రతి విషయాన్నీ అందులో పొందుపరుస్తామని, ఆ వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ (రిక్రూట్‌మెంట్‌) ఆలపాటి గిరిధర్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement