కరువు మండలాల్లో అదనపు ‘ఉపాధి’ 

Andhra Pradesh government declares 102 mandals drought affected - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం చర్యలు.. ఒక్కో కుటుంబానికి అదనంగా మరో 50 పనిదినాల పాటు పనుల కల్పన  

102 కరువు మండలాల్లో గరిష్టంగా 150 పని దినాలు  

గరిష్టంగా ఒక్కో కుటుంబానికి రూ.13,660 వరకు అదనపు లబ్ధి 

కనీసం 2.42 లక్షల కుటుంబాలకు మేలు 

సాక్షి, అమరావతి: కరువు మండలాల్లో కూలీల కుటుంబాలకు అదనపు పనులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కుటుంబా­నికి అదనంగా 50 పనిదినాల పాటు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించనుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 103 కరువు మండలా­లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో పూర్తిగా నగర ప్రాంతంలో ఉండే కర్నూ­­లు మిన­హాయించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మిగి­లిన 102 మండలాల్లో అదనపు పను­లు కల్పిస్తారు.

ఈ మండలాల్లో ఉపాధి హామీ పథ­కం కింద పనులు కావాలని కోరే ఒక్కో కుటుంబం ఏడాదికి గరిష్టంగా 150 పని­దినాల పాటు పనులు పొందే వీలుంటుంది. దీంతో 2.42 లక్షల కుటుంబాలకు మేలు చేకూ­రుతుంది. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.13,660 వరకు అదనపు లబ్ధి కలుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధి­కారులు సోమ­వారం కేంద్రానికి లేఖ రాశారు.

కరువు మండలాల్లో అదనపు పని దినాలు..
సాధారణంగా ఉపాధి హామీ పథకం కింద గ్రామీ­­ణ ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఏడా­దికి వంద పనిదినాల కల్పనకు అవకాశం ఉంటుంది. అయితే ప్రభు­త్వం ప్రక­టి­ంచిన కరువు మండలాల్లో మాత్రం ఈ ఏడాది ఒక్కో కుటుంబానికి గరి­ష్టంగా 150 పనిదినాల పాటు పనులు కల్పి­స్తారు. 102 మ­ం­డలాల పరిధిలో 5.68 లక్షల కుటుంబా­లకు చెందిన దాదాపు 10 లక్షల మంది కూలీ­లు ఉన్నారు.

వీరు ఉపాధి హామీ పథ­­­కం కింద పనులు చేసు­కుంటుంటారు. 5.68 లక్షల కుటుంబాల్లో దాదాపు లక్ష కుటుంబాలు ఇప్పటికే వంద పనిదినాల గరిష్ట లక్ష్యా­న్ని పూర్తి చేసుకుని ఉండడం లేదా గరిష్ట లక్ష్యానికి అతి దగ్గరగా ఉన్నా­రని అధి­కా­రులు వెల్లడించారు. ఈ కుటు­ంబాలతో­పాటు దాదాపు మరో లక్షన్నర కుటుంబాలు వచ్చే ఐదు నెలల్లో అదనపు పనులు కోరేందుకు అవ­కా­శం ఉందన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 102 మండ­లాల పరిధిలో కనీసం 2,42,282 కూలీల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top