17 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష | Amnesty granted to 17 life prisoners | Sakshi
Sakshi News home page

17 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష

Jun 5 2025 2:38 AM | Updated on Jun 5 2025 2:39 AM

Amnesty granted to 17 life prisoners

ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి స్రత్పవర్తన కలిగి అర్హులైన వారికి వర్తింపు 

రాత్రిపూట మహిళలు పనిచేసేలా కారి్మక, పారిశ్రామిక చట్టాల్లో సవరణలు 

175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్‌ఎంఈ పార్కులు 

అమరావతిలో 50 ఎకరాల్లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వ్యాలీ 

ఉద్దానం, కుప్పంలో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల కాంట్రాక్టర్ల నష్టం భరించాలని నిర్ణయం 

పోలీసు ఆకాడమీకి మరో 94.50 ఎకరాలు కేటాయింపు 

వైఎస్సార్‌ జిల్లా పేరు వైఎస్సార్‌ కడపగా మార్చేందుకు ఆమోదం 

కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ సంవత్సర పాలన పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని.. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి అర్హులైన 17 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన ఈ భేటీ ఇందుకు ఆమోదం కూడా తెలిపింది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు క్షమాభిక్ష ద్వారా విడుదలైన ఖైదీలు ప్రతీ మూడు నెలలకొకసారి ప్రొబేషన్‌ అధికారి, దాని పరిధిలోని పోలీసుస్టేషన్‌లో హాజరుకావాల్సి ఉంటుంది. 

మళ్లీ ఏదైనా నేరాలకు పాల్పడితే క్షమాభిక్ష రద్దుచేస్తారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. స్రత్పవర్తన కలిగిన జీవిత ఖైదీలకే క్షమాభిక్ష మంజూరుచేశారని, ఇందులో రాజకీయాలకు తావులేదని ఆయన చెప్పారు. మంత్రి వెల్లడించిన మరిన్ని నిర్ణయాలు ఏమిటంటే.. 

» 248 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి..  
» ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో మహిళలు రాత్రిపూట కూడా పనిచేసేందుకు వీలుగా కార్మిక, ఫ్యాక్ట­రీలు, బాయిలర్లు, బీమా వైద్యసేవ చట్టాల్లో పలు సెక్షన్ల సవరణకు ఆమోదం. దీనివల్ల మహి­ళల పనిగంటలు పెరుగుతాయి. ఓవర్‌టైమ్‌ కూడా పెరుగుతుంది. వ్యవస్థీకృత రంగంలో లింగ వివక్ష లేకుండా రాత్రిపూట తగిన భద్రత, రవాణా సౌకర్యాలతో మహిళలు రాత్రిపూట పనిచేసేందుకు ఈ సవరణలు వీలు కల్పిస్తాయి. 
» ప్రతీ శాసనసభ నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధికి ఆమోదం. వీటిల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌ నుంచి నిధుల కేటాయింపునకు గ్రీన్‌సిగ్నల్‌. 
» అమరావతిలో 50 ఎకరాల్లో క్వాంటం కంప్యూటింగ్‌ వ్యాలీ ఏర్పాటుకూ ఓకే. 
» గత టీడీపీ ప్రభుత్వంలో ఉద్దానం, కుప్పంలో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి కింద వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటుచేసిన కాంట్రాక్టర్లకు నష్టం వచ్చినందున  వారికి రూ.5.75 కోట్లు, రూ.8.22 కోట్లు చొప్పున వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ఇచ్చేందుకు అంగీకారం.  
» ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీ స్థాపన కోసం ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లి గ్రామాల్లోని 94.50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా హోంశాఖకు ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌.   
» వైఎస్సార్‌ జిల్లాను వైఎస్సార్‌ కడప జిల్లాగా పేరు మారుస్తూ జారీచేసిన నోటిఫికేషన్‌కూ ఆమోదం. 
» విశాఖపట్నంలోని హరిత హోటల్‌ యాత్రీనివాస్‌ ఆధునీకరణకు చేపట్టిన పనులకు ఇప్పటికే సవరించి అమలుచేసిన పనులకు గ్రీన్‌సిగ్నల్‌.  
» ఆంధ్రప్రదేశ్‌ ఎకనామిక్‌ సిటీస్‌ అభివృద్ధిలో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా వేమవరం గ్రామంలోని ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ పనులు పూర్తికి లైన్‌క్లియర్‌.  
» ఏలూరు జిల్లాలో నిర్మిoచదలచిన ఐ ఇన్‌స్టిట్యూట్‌ కోసం ఐఏఎస్‌ అధికారి దమయంతి దానంగా ఇవ్వనున్న 10.88 ఎకరాల భూమి బదలాయింపునకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజుల మినహాయింపునకు ఆమోదం. 
» గతంలో సూరత్‌లో 1.53 లక్షల మందితో నిర్వహించిన యోగా రికార్డును అధిగమించేలా జూన్‌ 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని, రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మందితో ఈ యోగా డేను నిర్వహించాలని నిర్ణయం. 

ఇక ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యే సమయానికి 25 కాగిత రహిత ఈ–కేబినెట్‌ సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రికి మంత్రివర్గం అభినందనలు తెలిపింది. అలాగే, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్‌ను కూడా అభినందించారు.  

Advertisement
 
Advertisement
Advertisement