
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేశారన్న ఆరోపణల కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్న వల్లభనేని వంశీ ఉన్నారు. రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైంది. రెండు రోజుల క్రితం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరవ్వగా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇవాళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వంశీపై ఇప్పటి వరకూ నమోదైన 6 కేసుల్లో బెయిల్ మంజూరైంది.
90 రోజులుగా రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. వరుసగా ఒక్కొక్క కేసులో బెయిల్ వస్తున్న తరుణంలో వంశీపై కక్ష పూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వంశీపై నిన్న నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు.. ఇవాళ నూజివీడు కోర్టులో వంశీని హాజరు పరిచారు.
ఈ నెల 29 వరకూ నూజివీడు కోర్టు రిమాండ్ విధించగా.. ఇవాళ తాజాగా వల్లభనేని వంశీపై మరో కేసును గన్నవరం పోలీసులు నమోదు చేశారు. గన్నవరంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై 58 పేజీలతో పోలీసులకు గనుల శాఖ ఏడీ ఫిర్యాదు చేశారు. క్రైమ్ నెం.142/2025తో గన్నవరం పీఎస్‍లో కేసు నమోదైంది. కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయాలని గన్నవరం పోలీసుల నిర్ణయించారు. వంశీపై కూటమి కక్షసాధింపు చర్యలపై ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. జైల్లో వంశీ శ్వాసకోస సమస్య, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.