గుత్తిలో ఘోర ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

గుత్తిలో ఘోర ప్రమాదం

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

= డివైడర్‌ను కారు ఢీకొనడంతో బైక్‌పై విద్యుత్‌ స్తంభం

= బైక్‌పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం

గుత్తి: గుత్తి ఆర్‌ఎస్‌లోని చంద్రప్రియ నగర్‌ వద్ద వైఎస్సార్‌ విగ్రహం సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న భాస్కర్‌ గౌడ్‌ (51) అక్కడికక్కడే మృతిచెందగా, బోయ ఎంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన భాస్కర్‌ గౌడ్‌, బోయ ఎంకన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనంలో గుత్తి వెళ్లారు. తిరిగి చెన్నంపల్లికి వెళ్తుండగా, కర్ణాటకలోని గౌరీబిదనూరుకు చెందిన కారు ఎదురుగా ఉన్న డివైడర్‌ మధ్యలో ఉన్న విద్యుత్‌స్తంభాన్ని ఢీకొనింది. దీంతో స్తంభం విరిగి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భాస్కర్‌ గౌడ్‌, బోయ ఎంకన్నపై పడింది. తలపై స్తంభం పడడంతో భాస్కర్‌ గౌడ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బోయ ఎంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. కారులో గౌరీబిదనూరుకు చెందిన సతీష్‌, మంజునాథ్‌తోపాటు డ్రైవర్‌ మణి ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్‌ మణి అక్కడి నుంచి పరారయ్యాడు. మృతుడు భాస్కర్‌ గౌడ్‌కు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బోయ ఎంకన్న పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ప్రభుత్వాస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు దుర్మరణం

గార్లదిన్నె: మండలంలోని తిమ్మంపేట క్రాస్‌ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందగా, తండ్రీకుమార్తెకు తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన హుస్సేనమ్మ (60) గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లి, జీవనం సాగించేది. ఉదయం ప్రాదేశిక ఎన్నికల్లో ఓటు వేసి, గార్లదిన్నెకు వెళ్లేందుకు తిమ్మం పేట క్రాస్‌ వద్ద ఆటోకోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో గ్రామానికి చెందిన విజయ్‌ కుమార్తె జయశ్రీతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గంమధ్యలో కనిపించిన హుసేనమ్మ గార్లదిన్నెకు వెళ్లేందుకు బైక్‌ ఎక్కుతుండగా.. వెనుక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హుసేనమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. విజయ్‌, జయశ్రీలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement