హరితగౌడ్‌ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత | - | Sakshi
Sakshi News home page

హరితగౌడ్‌ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత

Nov 7 2026 12:18 AM | Updated on Nov 7 2026 12:18 AM

● వైఎస్సార్‌సీపీ నాయకుడు వెన్నపూస రవీంద్రారెడ్డి

అనంతపురం: ఉపాధ్యాయిని హరితగౌడ్‌ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. గురువారం కూడేరు మండలం కడదరకుంటలో పోలింగ్‌ బూత్‌లో ఎన్నికల విధుల్లో ఉండగా అస్వస్థతకు గురై హరితగౌడ్‌ మృతిచెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం ఉపాధ్యాయ లోకానికి తీరని లోటన్నారు. హరిత గౌడ్‌ కుటుంబ సభ్యులకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్నికల విధులు ఉద్యోగులకు ప్రాణసంకటంగా మారాయని విమర్శించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక, ఒత్తిళ్ల మధ్య అధికారులు విధులు నిర్వర్తించాల్సి వస్తోందన్నారు. అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా రిగ్గింగ్‌, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, అధికారులను సైతం లెక్కచేయకుండా అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహిస్తుండడమే ఉద్యోగుల ప్రాణాల మీదకు తెస్తోందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేయాలని ఆయన కోరారు.

బాలుడి బలవన్మరణం

● రూ.500 అడిగితే తల్లి రూ.200 ఇచ్చిందని అలక

● అనంతపురం రూరల్‌ మండలంలో ఘటన

రాప్తాడు రూరల్‌: తన తల్లిని రూ.500 అడిగితే రూ.200 మాత్రమే ఇచ్చిందని మనస్తాపంతో ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని ఆలమూరు జగనన్న కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. రూరల్‌ పోలీసులు తెలిపిన మేరకు.. ఆలమూరు జగనన్న కాలనీకి చెందిన కురుబ నిఖిల్‌ (14) అనంతపురం నగరంలోని కేఎస్‌ఆర్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో తల్లిని రూ.500 అడిగాడు. అయితే డబ్బులు ఎందుకు అని ఆమె ప్రశ్నించింది.. రూ.500 లేదని రూ.200 మాత్రమే ఇచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన నిఖిల్‌ ఏడుస్తూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఫ్యానుకు చీరతో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించగా అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందాడు. ఈ ఘటనపై బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement