ఆశ పెట్టిన అర్నబ్‌..మురిపించని మురసు | - | Sakshi
Sakshi News home page

ఆశ పెట్టిన అర్నబ్‌..మురిపించని మురసు

Nov 7 2026 12:18 AM | Updated on Nov 7 2026 12:18 AM

అనంతపురం అగ్రికల్చర్‌: ఈ ఏడాది ఈశాన్యం శూన్యంగా కనిపిస్తోంది. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి వర్షాభావంతో రైతులు అయోమయంలో ఉన్నారు.. కనీసం ఇటీవల వరుస తుపాన్లు అయినా ఆదుకుంటాయని రైతులు ఎంతగానో ఎదురుచూశారు..అర్నాబ్‌ తుపాను ఆశపెట్టి ఆవిరి చేస్తే.. ఆ వెంటనే వచ్చిన మురసు కూడా ఉసూరుమనిపించింది.. తుపాన్లు తుస్సుమనడంతో రబీ సాగు మందకొడిగా సాగింది. అక్కడక్కడ కురిసిన తేలికపాటి జల్లులు పడడంతో అరకొర తేమలోనే ప్రధానపంట పప్పుశెనగ సాగు చేస్తున్న దుస్థితి నెలకొంది.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు 3.43 లక్షల హెక్టార్ల ఖరీఫ్‌ను దెబ్బతీయగా.. 1.08 లక్షల హెక్టార్ల రబీ ఆశలు గల్లంతవుతున్నాయి. ఆఖరుకు అక్టోబర్‌ చివరి వారంలో అర్నాబ్‌, తాజాగా మురసు లాంటి తీవ్రస్థాయి తుపాన్లు కూడా నిరాశపరిచాయి. సెప్టెంబర్‌ 20 నుంచి 25 తేదీల మధ్య వాయుగుండం ప్రభావంతో కురిసిన మోస్తరు వర్షాల తర్వాత వరుణుడు కనుమరుగు కావడంతో ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ ఏరువాక ద్వారా రైతులకు కష్టనష్టాలు మరింత పెరిగాయి.

33 మి.మీ వర్షపాతం నమోదు:

అక్టోబర్‌ ఒకటి నుంచి మొదలైన ఈ రబీలో ఇప్పటి వరకు 33 మి.మీ వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌లో విస్తారంగా వర్షాలు పడాల్సి ఉండగా 100.7 మి.మీ గానూ 69 శాతం తక్కువగా కేవలం 31.3 మి.మీ నమోదైంది. ఇక నవంబర్‌లో 28.7 మి.మీ గానూ ప్రస్తుతానికి 1.7 మి.మీ నమోదైంది. అక్టోబర్‌ నెలంతా వరుణుడి జాడ లేకపోవడంతో రబీ పంటసాగు అంచనాలు తారుమారవుతున్నాయి. చివరి వారంలో సంభవించిన తీవ్రస్థాయి తుఫాను అర్నాబ్‌ ప్రభావంతో భారీ వర్షాలు తప్పవని వాతావరణశాఖ హెచ్చరించినా అక్కడక్కడ తేలికపాటితోనే సరిపెట్టాయి. వెనువెంటనే ఏర్పడిన మురసు తుఫాను కూడా ప్రభావం చూపిస్తుందని ఆశించినా ఫలితం కనిపించడం లేదు. కనీసం తేలికపాటి కూడా నమోదు కావడం లేదు.

15వ వరకు అనుకూలమైన కాలం..

ఈనెల 15 వరకు పప్పుశెనగ సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు ప్రకటించడంతో మంచి వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పెద్దవడుగూరు మాత్రమే సాధారణ వర్షపాతం జాబితాలో ఉండగా మిగతా 30 మండలాలు తక్కువ జాబితాలోనే ఉన్నాయి. అందులోనూ 15 మండలాల్లో 50 నుంచి 90 శాతం తక్కువగా వర్షపాతం నమోదు కావడం గమనార్హం. తేలికపాటి వర్షాలతో అక్టోబర్‌లో కేవలం మూడంటే మూడు వర్షపు రోజులు (రెయినీడేస్‌) నమోదు కావడం చూస్తే వర్షాభావ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయనేది అర్థమవుతుంది. పప్పుశెనగ కోసం నల్లరేగళ్లు చాలా వరకు ఖాళీగానే దర్శనమిస్తుండగా నవంబర్‌లో నీటి వసతి కింద వేరుశనగ, వరి లాంటి పంటలు సాగులోకి రావాల్సివున్నా... భూగర్భజలాలు తగ్గిపోవడంతో సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.

రైతులను నిరాశ పరిచిన వరుస తుపాన్లు

కనీసం తేలికపాటి వర్షం కూడా కురవని వైనం

అరకొర తేమకే అక్కడక్కడ పప్పుశెనగ సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement