హతవిధీ.. కనువిప్పు ఏదీ! | - | Sakshi
Sakshi News home page

హతవిధీ.. కనువిప్పు ఏదీ!

Nov 7 2026 12:18 AM | Updated on Nov 7 2026 12:18 AM

ఎన్నికల విధులు ఉద్యోగులను ఒత్తిడికి గురిచేస్తున్నాయా..? అధికారుల లెక్కచేయని తనం ప్రాణాలమీదకు తెస్తోందా.. వయోభారం.. అనారోగ్య సమస్యలు ఉద్యోగుల ఊపిరితీస్తున్నాయా?.. ఇలా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఎన్నో సందేహాలు, అనుమానాలకు కూడేరు మండలం కడదరకుంటలో ఎన్నికల విధుల్లో ఉండగా.. ప్రాణాలొదిలిన ఓపీఓ హరితగౌడ్‌ ఘటన తావిస్తోందంటున్నాయి.. తనకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని అధికారులను వేడుకున్నా అధికారుల మనసు కరగలేదు.. ఆరోగ్య పరిస్థితి వివరించినా లెక్కచేయలేదు.. ఫలితంగా ఉన్నఫళంగా నిండు ప్రాణం బలి కావడం చర్చనీయాంశమైంది.. – అనంతపురం ఎడ్యుకేషన్‌:

డి.హీరేహాళ్‌ మండలం కాదలూరు ఎంపీపీ ఎస్‌లో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్‌.హరితగౌడ్‌ (59) కూడేరు మండలం కడదరకుంటలోని పోలింగ్‌ బూత్‌లో గురువారం ఎన్నికల విధుల్లో ఉండగా, తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందడం అందరినీ కలచివేసింది. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

వరుస ఎన్నికల విధులతో ఒత్తిడి..

ఉపాధ్యాయిని హరితగౌడ్‌ సొంతూరు గుంతకల్లు. భర్త జి.ఉపేంద్రగౌడ్‌ ప్రైవేట్‌ కళాశాలలో పని చేస్తుండగా, కుమారుడు సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెన్సీలో పని చేస్తున్నాడు. ప్రస్తుతం మూడేళ్లుగా రాయదుర్గంలోనే నివాసం ఉంటున్నారు. హరితగౌడ్‌ అనారోగ్యంతో బాధపడుతుండేవారు. షుగర్‌, బీపీతో పాటు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుండేవారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తొలుత ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో భాగంగా అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల విధులకు కేటాయించారు. ఎలాగోలా విధులు పూర్తయ్యాయని విశ్రాంతి తీసుకుందామనుకుంటుండగా.. మరో రెండు రోజులకే స్థానిక సంస్థల ఎన్నికలైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బాధ్యతలు కేటాయించారు. అనారోగ్యం ఓ వైపు.. పనిభారం మరోవైపు తీవ్ర ఒత్తిడిని పెంచింది. అనంతపురం నగరపాలక ఎన్నికల విధుల సమయంలోనూ అనారోగ్యంగా ఉండగా.. భర్త తరచూ ఫోన్‌ చేసి ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారని తోటి సిబ్బంది తెలిపారు.

ముందే చెప్పినా మినహాయింపు ఇవ్వలేదు..

అలసటగా ఉంది.. ఆరోగ్యం సహకరించలేదు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది.. అని బాధితురాలు హరితగౌడ్‌ ముందుగానే సంబంధిత ఎన్నికల అధికారులకు విన్నవించుకున్నారు.. కుటుంబ సభ్యులు కూడా పలుమార్లు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. విధుల నుంచి మినహాయింపు దొరకలేదు. పైగా విధులకు హాజరుకాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, సాయంత్రానికి సంజాయిషీ నోటీసులు వస్తాయని హెచ్చరించారు. దీంతో అస్వస్థతగా ఉన్నా ...ఓపిక కూడదీసుకొని విధులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

పోలింగ్‌ కేంద్రంలో సౌకర్యాలు లేక సతమతం..

పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీసం సౌకర్యాలు కల్పించలేదు.. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు బాత్రూంలు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. చాలా పోలింగ్‌ కేంద్రాల్లో భోజన సదుపాయం, తాగునీరు కూడా కల్పించలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. వయసు పైబడిన ఉపాధ్యాయులే కాకుండా ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి మినహాయింపులు కల్పించాలని, ఎన్నికల విధుల నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులు, అర్హులను గుర్తించి ముందస్తుగా శిక్షణ ఇవ్వాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఎన్నికల విధుల పేరుతో ఉద్యోగుల ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితులు రాకుండా ప్రభుత్వం, ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ సంఘాలు కోరుతున్నాయి.

అస్వస్థతతో విలవిల్లాడి.. అంతలోనే ప్రాణం వదిలి..

విరామం లేక విధుల ఒత్తిడిలో బలవుతున్న ఉద్యోగులు

ఎన్నికల విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన ఓపీఓ

అనారోగ్యమని హరిత గౌడ్‌ చెప్పినా కనికరించని అధికారులు

అస్వస్థతతో ఉన్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణం ఒదిలిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement