అనంతపురం అర్బన్: ఇటీవల జిల్లాలో జరుగుతున్న పరిణామాలు, ఎన్నికల్లో జరిగిన అధికార పార్టీ దౌర్జన్యాలపై హైకోర్టు సుమోటాగా కేసు స్వీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్ చేశారు. ఎన్నికలు అరాచక వాతావరణంలో నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రా పునేఠాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలు సజావుగా జరిపించాలని కలెక్టర్, ఎస్పీలను కోరి నా చర్యలు లేవన్నారు. ప్రతిపక్ష పార్టీల వారిపై బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఓడించే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీతో సీపీఐ సీట్ల సర్దుబాటు చేసుకుందన్నారు. పలు చోట్ల సీపీఐ అభ్యర్థులు పోటీ చేసినా, టీడీపీ వాళ్లు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేయడంతో తమ అభ్యర్థులు ఓడిపోయాన్నారు. అనంతపురంలో బీజేపీ మేయర్ అభ్యర్థిని ఓడించేందుకు తమ పార్టీ కార్యకర్తలు విశేషంగా పని చేశారన్నారు. 11వ డివిజన్‌లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన అనుచరులతో వెళ్లి దౌర్జన్యం చేశారన్నారు. రాష్ట్ర కారవర్గ సభ్యుడు జాఫర్‌పై లాఠీచార్జీ చేయించారన్నారు. నగర కార్యదర్శి శ్రీరాములు, ఏఐటీయూసీ నేతరాజేష్‌గౌడ్, నాయకుడు కృష్ణుడు పాల్గొన్నారు.


