‘పచ్చ’ మూకల పైశాచికం | - | Sakshi
Sakshi News home page

‘పచ్చ’ మూకల పైశాచికం

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

పెద్దవడుగూరు : ‘అధికారంలో ఉన్నాం.. ఏం చేసినా ఎదురుండదనే’ ధోరణితో అధికార టీడీపీ నేతలు వ్యహరిస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి అధికార పార్టీ నేతల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే ఓటమి తప్పదని భయంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనా విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు. రావులుడికి గ్రామంలోని పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ ప్రారంభం కాగానే టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కూర్చోనివ్వకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి నిర్మలమ్మ అక్కడికి చేరుకొని ఏజెంట్లను ఎందుకు బయటకు పంపుతున్నారని ప్రశ్నించడంతో అక్కడే ఉన్న ‘పచ్చ’మూకలు బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న రంగేశ్వర్‌రెడ్డి, మద్దిలేటిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న మహిళలు తిరగబడటంతో అక్కడి నుంచి ఉడాయించారు. విషయం పచ్చ మూకలకు తెలియడంతో పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకుడు రంగేశ్వరరెడ్డి ఇంటి వద్దకు వచ్చి, అతని తమ్ముడు బాలిరెడ్డి, మహిళలపై దాడికి తెగబడ్డారు. జరిగిన సంఘటనపై పోలీసులకు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని విచారించారు. దాడిలో గాయపడిన బాలిరెడ్డికి కుటుంబ సభ్యులు చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. దిమ్మగుడి లో పోలింగ్‌ కేంద్రం వద్ద రిగ్గింగును అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఓబిలేసు (రవి)పై పచ్చ గూండాలు దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు క్షతగాత్రున్ని అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

ముట్టాలలో ఏజెంట్‌పై టీడీపీ నేత దాడి

ఆత్మకూరు: అధికార పార్టీ నాయకుల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు కూడా ఓటర్లకు స్వేచ్ఛ ఇవ్వడంలేదు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపైనా దాడులకు పాల్పడుతున్నారు. ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను నామినేషన్‌ అడ్డుకున్న విషయం విదితమే. అడ్డదారిలో ముట్టాల పంచాయతీ ఎంపీటీసీ స్థానాన్ని ఏకంగా ఏకగ్రీవం చేసుకున్నారు. అయితే గురువారం జెడ్పీటీసీ స్థానానికి పోలింగ్‌ జరిగింది. అయితే ముట్టాల పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్న ముత్యాలరెడ్డిపై అధికార టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దీంతో ముత్యాలరెడ్డి తలకు గాయం కావడంతో అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన వైఎస్సార్‌సీపీ నాయకులు వెంటనే ఆయన్ను కారులో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. తలకు గాయం కావడంతో ఎక్స్‌రే తీయాలని వైద్యులు సూచించడంతో అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు దుబ్బ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ డీసీసీ డైరెక్టర్‌ రేనాటి వాసుదేవరెడ్డి, యూత్‌ కన్వీనర్‌ గూలి కొండారెడ్డి ఆసుపత్రికి చేరుకొని ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డితో ఫోన్‌లో పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా అధికారులతో మాట్లాడుతామని, మెరుగైన చికిత్స అందించాలని ఆయన సూచించారు.

‘పచ్చ’నేతల ప్రసన్నం కోసం పైశాచిక దాడి

అనంతపురం సిటీ: కంబదూరు మండల ఎస్‌ఐ లోకేష్‌ ‘పచ్చ’ బంట్రోతుగా మారాడు. ప్రాదేశిక ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా భద్రత కల్పించాల్సిన పోలీస్‌ అధికారి.. ఏకంగా అధికారపార్టీ అల్లరిమూకకు అండగా నిలిచాడు.. విచక్షణ కోల్పోయి ఏకంగా దివ్యాంగుడైన వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో బాధితుడు ఆస్పత్రి పాలు కావాల్సి వచ్చింది. కంబదూరు మండలం గొల్లపల్లి పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్త అశోక్‌ గురువారం వెళ్లాడు. ఓటు వేసి బయటకు వస్తుండగా టీడీపీ నేతల ఆదేశాలతో ఎస్‌ఐ లోకేష్‌ అతన్ని అడ్డుకొని దుర్భాషలాడాడు. తనను ఎందుకు దూషిస్తున్నారని అశోక్‌ ప్రశ్నించడంతో ఎస్‌ఐ కోపోద్రిక్తుడై లాఠీతో చితకబాదాడు. స్థానికులు నిలువరించే ప్రయత్నం చేసినా ఎస్‌ఐ వినలేదు. పలుమార్లు దాడి చేయడంతో అశోక్‌ ఎడమ చేతి మణికట్టు వద్ద ఎముక విరిగింది. స్థానికులు అతన్ని కళ్యాణదుర్గంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శరీరంపై మూగదెబ్బలు ఉండడంతో స్థానిక వైద్యుల సూచన మేరకు అతన్ని కుటుంబ సభ్యులు అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. ఇదే తరహాలోనే కురాకులపల్లిలో అయ్యంపల్లి నాగరాజుపైనా ఎస్‌ఐ లోకేష్‌ దాడికి తెగబడ్డాడు. కేవలం దళితులను లక్ష్యంగా చేసుకొని ఎస్‌ఐ దాడి చేశారని, దీనిపై జిల్లా ఎస్పీతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు, కుటుంబ సభ్యులు తెలిపారు.

పలువురి పరామర్శ : ఎస్‌ఐ లోకేష్‌ దాడిలో తీవ్రంగా గాయపడి అనంతపురంలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త అశోక్‌ను ఆ పార్టీ యువజన నేత గొల్లపల్లి శివ, ఎస్సీఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి గురువారం రాత్రి పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఎస్‌ఐ లోకేష్‌ దాడులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు నాయకులు తెలిపారు.

కళేకుర్తిలో ఉద్రిక్త పరిస్థితి

కణేకల్లు: మండలంలోని కళేకుర్తిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓటింగ్‌ ఉద్రిక్తతకు దారితీసింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న ఓటర్లు.. బ్యాలెట్‌ పేపర్లు తీసుకొని ఓటేశారు. బాక్స్‌లో బ్యాలెట్‌ పేపర్‌ను వేయకుండా బయటికి తీసుకొచ్చారు. ఈవిషయాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు గమనించి, అడ్డుకున్నారు. కాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే ఓటేశామని ఆపార్టీ నేతలకు చూపించేందుకు కొందరు ఓటేసి బ్యాలెట్‌ పేపర్‌ను బయటికి తీసుకొచ్చారు. ఇలా బయటికొచ్చిన బ్యాలెట్‌ పేపర్‌ను అధికార పార్టీ నేతల అనుచరులు ఓటేసేందుకెళ్లే సమయంలో తీసుకెళ్లి బ్యాలెట్‌ బాక్స్‌లో వేస్తూ వచ్చారు. దీన్ని పసిగట్టిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె.ఉషారాణి బ్యాలెట్‌ పేపర్లు బయటకు తీసుకురావడాన్ని అడ్డుకున్నారు. తటస్తులతోపాటు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులుగా ఉన్న ఓటర్లను టీడీపీ నేతలు తమ పార్టీకే ఓటేయాలని బెదిరించి, ఒత్తిళ్లకు గురి చేయడంతో టీడీపీకే ఓటేశామని తెలయజేసేందుకు ఓటర్లు ఇలా అక్రమాలకు పాల్పడ్డారని ఉషారాణి ఆరోపించారు. ఇలా ఓటర్లను బెదరించడం దారుణమని టీడీపీ నేతలతో ఉషారాణి వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్‌ఐ నాగమధు అదనపు సిబ్బందిని అక్కడకు తెప్పించారు. దీంతో పరిస్థితి అదుపులో వచ్చింది.

ఎస్‌ఐ లోకేష్‌ దాడిలో గాయపడిన అశోక్‌

ఆస్పత్రిలో ముత్యాలరెడ్డిని పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

పామిడి: గుమ్మనూరు జయరాం ఇలాకాలో తెలుగు తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. మహిళలపైనా ఏకంగా దాడులు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. వివరాలు ఇలా.. పాళ్యంతండాలో 2025 జనవరిలో ఓ మహిళా సంఘం సభ్యురాలు శ్రీనిధి రుణం రూ. లక్ష తీసుకుంది. ఆమె ఏడాదిపాటు సక్రమంగా కంతులు చెల్లించింది. ఈ కంతుల వసూలులో పాళ్యంతండా గ్రామ టీడీపీ కార్యకర్త అయిన యానిమేటర్‌ రమావత్‌ అంజినాయక్‌ మహిళా సభ్యురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు. బుధవారం ఆమె ఒంటరిగా విషయాన్ని తెలుసుకున్న యానిమేటర్‌.. లైంగిక వేధింపులకు యత్నించాడు. దీంతో బాధితురాలు అడ్డుకొని అక్కడి నుంచి తప్పించుకుంది. అంతటితో ఆగకుండా యానిమేటర్‌ కుటుంబ సభ్యులతో వచ్చి బాధితురాలి కుటుంబంపై దాడి చేసి, గాయపరిచాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పామిడి పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు.

పామిడిలో రెచ్చిపోయిన మాజీ కౌన్సిలర్‌ .. : పామిడిలో ఇటీవల మాజీ కౌన్సిలర్‌ టీటీ రమణ్‌రావు రెచ్చిపోయాడు. స్థానిక మెయిన్‌బజార్‌లో శ్రీషిర్డి సాయిబాబా గుడి వద్ద కిరాణాషాపు నిర్వహిస్తున్న ఓ మహిళపై ఇటీవల టీటీ రమణరావు మరికొందరితో కలిసి దాడి చేశాడు. ఈ దాడి దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధిత మహిళ చెప్పగా, పోలీసులను డబ్బుపెట్టి కొనేస్తామని మాజీ కౌన్సిలర్‌ వర్గీయులు బెదరించినట్లు సమాచారం.

బరితెగిస్తున్న తెలుగు తమ్ముళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement