అనంతపురం అర్బన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా ప్రతిపక్ష అభ్యర్థులపై అఽధికార పార్టీ వ్యక్తులు పోలీసుల సమక్షంలో దాడులు చేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నాగేంద్రకుమార్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని బాధ్యులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గుంతకల్లు, అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు, తదితర ప్రాంతాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై దాడులు చేయడం, నామినేషన్ పత్రాలను చింపివేయడం, ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దాడులకు పాల్పడటం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలను గృహనిర్భందం చేయడం ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనన్నారు. దాడులకు పాల్పడిన అధికారపార్టీ వ్యక్తులపై ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు కాలేదని నిలదీశారు. ఇంటి భయానక పరిస్థితులను అధికారపార్టీ నాయకులు సృష్టిస్తున్నా కలెక్టర్, ఎస్పీ స్పందించకపోవడం శోచనీయమన్నారు.
సుమోటోగా విచారణ చేపట్టాలి
దాడులపై ఎన్నికల సంఘం సమోటోగా విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. నామినేషన్ వేయకుండా అడ్డుకున్న అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలన్నారు. నామినేషన్ల గడువు మరో రెండు రోజులు పొడిగించాలన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల ఎన్నికల హక్కులను కాలరాయడమే రెడ్‌బుక్ రాజ్యాంగమా అని ప్రశ్నించారు. స్వేచ్చాయుత, నిష్పక్షపాల ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


