హాస్టల్‌ విద్యార్థికి పాముకాటు | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ విద్యార్థికి పాముకాటు

Aug 25 2026 12:15 AM | Updated on Aug 25 2026 12:15 AM

మౌలిక సదుపాయాలు మృగ్యం

లోపించిన అధికారుల పర్యవేక్షణ

ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్‌

కళ్యాణదుర్గం: ఇంటి వాతావరణం మరిపించాల్సిన సంక్షేమ వసతిగృహాలు మౌలిక సదుపాయాల లోపంతో దుర్భరంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్లలేక.. తప్పనిసరి పరిస్థితుల్లో వసతిగృహాల్లో ఉంటూ చదువును కొనసాగిస్తున్నారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ (ఎస్సీ), గిరిజన సంక్షేమ (ఎస్టీ) వసతి గృహాలు 50 ఉన్నాయి. వీటిలో 30 బాలుర, 20 బాలికల వసతిగృహాలు ఉన్నాయి. మొత్తం 5,608 మంది బాలబాలికలు ఉంటున్నారు.

అన్నీ సమస్యలే..

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ప్రభుత్వం పరుపులు సరఫరా చేయాలి. కానీ ఎక్కడా ఇవ్వలేదు. దీంతో నేలపైనే పడుకుంటున్నారు. లైట్లు పనిచేయకపోవడంతో రాత్రిపూట చీకట్లోనే మగ్గుతున్నారు. దోమలబెడదతోనూ సతమతమవుతున్నారు. రక్షిత మంచినీరు కూడా కరువే. ఇక్కడ వాడుక అవసరాల కోసం అందుబాటులో ఉన్న ఉప్పునీరే గతి. స్నానపు గదులు లేకపోవడంతో ఆరుబయటే చేయాల్సి వస్తోంది. నిర్వహణ లేక మరుగుదొడ్లు వినియోగంలో లేవు. దీంతో కాలకృత్యాలు తీర్చుకోవడానికి బహిర్భూమికి వెళ్తున్నారు.

ముద్ద అన్నం.. నీళ్ల సాంబారే!

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందడం లేదు. చాలీచాలని మెస్‌ బిల్లులను కూడా పెండింగ్‌ ఉంచడంతో భోజనాలు పెట్టేందుకు హాస్టల్‌ ఇన్‌చార్జ్‌లు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో ముద్ద అన్నం.. కూరగాయలు కనిపించని నీళ్ల సాంబారుతో సరిపెడుతున్నారు.

విధుల్లో బాధ్యతారాహిత్యం

సంక్షేమ వసతిగృహాల వార్డెన్లు విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇష్టారాజ్యంగా వచ్చి వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలా వచ్చి.. కాసేపు ఉండి.. తర్వాత కుక్‌లు, వాచ్‌మెన్లను చూసుకోండంటూ చెప్పి వెళ్లిపోవడం పరిపాటిగా మారిపోయింది.

శోక సంద్రమైన మల్లిపల్లి

విద్యార్థి హర్షవర్థన్‌ మృతితో కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. భవిష్యత్తులో మంచి ప్రయోజకుడవుతాడనుకున్న తమ కుమారుడు ఇలా మృత్యువాత పడటం చూసి తల్లిదండ్రులు ప్రభాకర్‌, హేమావతి గుండెలవిసేలా రోదించడం అందరినీ కలచివేసింది. బంధువులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి హర్షవర్ధన్‌కు కడసారి వీడ్కోలు పలికారు. ఏఎస్‌డబ్ల్యూఓ రామ్మోహన్‌, వార్డెన్లు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.

గుంతకల్లు: బీసీ హాస్టల్‌లో ఓ విద్యార్థికి పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. ఎస్‌.వి. డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్‌ చదువుతున్న సుమన్‌ పాత గుంతకల్లులోని శ్మశాన వాటిక పక్కనగల బీసీ సంక్షేమ హాస్టల్‌లో ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం కళాశాల నుంచి హాస్టల్‌కు చేరుకున్నాడు. ఆవరణలో సేద తీరుతున్న సమయంలో ఎడమకాలుకు ఏదో కుట్టినట్టు అనిపించడంతో సుమన్‌ గట్టిగా కేకలు వేశాడు. చూస్తే అక్కడ పాము కనిపించింది. వెంటనే అతడిని సహచర విద్యార్థులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అనంతపురం తీసుకెళ్లాలని సూచించారు. అయితే వారు స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుమన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

విద్యార్థి సంఘాల ఆందోళన

ప్రహరీ లేనందున విషపురుగులు హాస్టల్‌లోకి వస్తున్నాయని, ఈ క్రమంలోనే విద్యార్థి సుమన్‌ పాముకాటుకు గురయ్యాడని, దీనంతటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ నాయకులు ధ్వజమెత్తారు. వాల్మీకి సర్కిల్‌లో జాతీయరహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రహరీ లేకపోవడంతో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. విద్యార్థి పాముకాటుకు గురయ్యారన్న సమాచారం తెలియగానే బీసీ వెల్ఫేర్‌ డీడీ ఖుష్బూ కొఠారి అక్కడకు చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి.. విద్యార్థికి మెరుగైన వైద్యం చేయిస్తామని, హాస్టల్‌లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement