సంక్షోభంలో ‘అనంత’ రైతులు | - | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో ‘అనంత’ రైతులు

Aug 25 2026 12:15 AM | Updated on Aug 25 2026 12:15 AM

అనంతపురం: ‘ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న హంద్రీ–నీవా సుజల స్రవంతి నీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంకు లబ్ధి చేకూరేలా చేసుకున్నారు. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే రెండో ప్రాంతంగా ఉన్న అనంతపురం జిల్లాలోని రైతులను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేశారు’ అని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. రైతు సమస్యలపై సోమవారం ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్‌లో అనంతపురం జిల్లాలో సాధారణ సాగులో 55 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 48 శాతం మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయన్నారు. ఎల్‌–నినో ప్రభావం కారణంగా 52 శాతం మాత్రమే వర్షపాతం నమోదైందన్నారు. వర్షాభావం వల్ల బొమ్మనహాళ్‌, కణేకల్లు, విడపనకల్లు మండలాల్లో 35 వేల ఎకరాల పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. తక్షణమే రక్షక తడులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హంద్రీ–నీవా నుండి ఉమ్మడి అనంతపురం జిల్లా చెరువులకు తక్షణమే నీరు సరఫరా చేయాలన్నారు. హంద్రీ–నీవా నీటిని ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సాగునీటి విషయంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు జిల్లా రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటి దాకా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించలేదంటే పాలకుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేస్తోందన్నారు. తుంగభద్ర నుంచి హెచ్చెల్సీకి 16 టీఎంసీలు మాత్రమే కేటాయించారన్నారు. వాస్తవానికి నీటి లభ్యత ఆధారంగా 21 టీఎంసీలు వచ్చే అవకాశమున్నా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే జిల్లాకు ప్రత్యేక కరువు ప్యాకేజీ ప్రకటించి.. రైతులను, కూలీలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలు పట్టించుకోకపోతే జాతీయ రహదారులను దిగ్బంధించి చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. నీటి సమస్యలపై పోరాడేందుకు రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, నాయకులు భరత్‌రెడ్డి, భీమిరెడ్డి, డొనేకల్‌ రమేష్‌, చిన్న వెంకటేశ్‌, ఎస్‌.నాగిరెడ్డి, దేవంద్ర, తిమ్మరాజు, అశోక్‌ కుమార్‌, డొనేకల్‌ బద్రీ, సిద్దు, ఎర్రిస్వామి, కరకముక్కల ఆదిమల్ల పాల్గొన్నారు.

వర్షాలు లేక.. సాగునీరు రాక విలవిల

హంద్రీ–నీవా నీటిని ఉమ్మడి కర్నూలు, ‘అనంత’కు ఇవ్వండి

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement