27న జెడ్పీ సర్వసభ్య సమావేశం | - | Sakshi
Sakshi News home page

27న జెడ్పీ సర్వసభ్య సమావేశం

Aug 25 2026 12:15 AM | Updated on Aug 25 2026 12:15 AM

అనంతపురం న్యూటౌన్‌: ఉమ్మడి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఈ నెల 27న నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ తెలిపారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాలపై చర్చించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చిస్తామని గిరిజమ్మ చెప్పారు. జిల్లా పరిషత్‌ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సమావేశానికి హాజరు కావాలని కోరారు.

ప్రగతి నివేదికలతో రండి

ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఈ నెల 27న చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జరుగుతుందని, అలాగే స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు కూడా ఉంటాయని సీఈఓ పి.విజయలక్ష్మి తెలిపారు. జిల్లాస్థాయి శాఖాధిపతులు, అధికారులు తమ తమ శాఖల పురోగతి నివేదికలతో తప్పక హాజరుకావాలని ఆమె కోరారు.

30న ఉచిత కృత్రిమ

చేతుల పంపిణీ

అనంతపురం సిటీ: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ, రోటరీ క్లబ్‌–అనంతపురం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30న కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ మేనేజింగ్‌ కమిటీ సభ్యుడు దాసరి భరత్‌, ట్రెజరర్‌ సుంకర రమేష్‌, బిసాతి భరత్‌ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలోని ఆరు జిల్లాల పరిధిలో మోచేతి కింది భాగంలో చేయి కోల్పోయిన దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ చేతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ముందుగా ‘చేయూత’ కాల్‌ సెంటర్‌ 88663 06969కు ఫోన్‌ చేసి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో యూత్‌ రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు జయమారుతి, అంబరీష్‌, బాలాజీ, మంజునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

29న ‘ఖేలో ఇండియా

సంవాద్‌’

అనంతపురం: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న ప్రధాని నరేంద్రమోదీ ‘ఖేలో ఇండియా సంవాద్‌’ కార్యక్రమం ద్వారా వర్చువల్‌గా ప్రసంగించనున్నారని ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్‌ ఎన్‌వీఆర్‌ జ్యోతి కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 1600 ప్రాంతాల్లో దాదాపు 8 లక్షల మంది యువత వర్చువల్‌ సమావేశంలో పాల్గొంటారన్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి ఎస్కేయూ, ఆర్ట్స్‌ కళాశాలలో ఖేలో ఇండియా సంవాద్‌ కార్యక్రమం వేదికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా యువజన అధికారి ఐశయ్య, ప్రోగ్రాం సూపర్‌వైజర్‌ శ్రీనివాసులు, మై భారత్‌ కో ఆర్డినేటర్‌ బిసాతి భరత్‌, నోడల్‌ అధికారులు శారదాదేవి, నాగభూషణం, మోడరేటర్లు బిసాతి జీవన్‌ కుమార్‌, జయమారుతి, పీఆర్వో బాల సత్యనారాయణ పాల్గొన్నారు.

నేటి నుంచి ‘ప్రత్యామ్నాయ’ విత్తనాలకు రిజిస్ట్రేషన్లు

అనంతపురం అగ్రికల్చర్‌: ప్రత్యామ్నాయ పంటల విత్తనాలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. ‘కాగితాల్లోనే ప్రత్యామ్నాయం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి వ్యవసాయశాఖ స్పందించింది. మంగళవారం నుంచి తాడిపత్రి డివిజన్‌లో ఉన్న నాలుగు మండలాలు మినహా మిగతా 28 మండలాల పరిధిలో ఉన్న ఆర్‌ఎస్‌కేల్లో ప్రత్యామ్నాయ విత్తనాలు అవసరమైన రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జేడీఏ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఖరీఫ్‌ కింద సాగులోకి వచ్చిన పంటల విస్తీర్ణం పోనూ.. మిగిలిన 1.40 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయం కింద పంటలు సాగు చేసుకునేందుకు వీలుగా ఉలవలు, పెసలు, అలసందలు, కొర్రలు, జొన్నలు, కందులు తదితర పంటలకు 31 వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేస్తామని ప్రకటించింది. 80 శాతం సబ్సిడీ పోనూ రైతులు తమ వాటా కింద 20 శాతం చెల్లించాలని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement