శెట్టూరు: ఎస్సీ వసతిగృహ విద్యార్థి హర్షవర్ధన్ తేజ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి పదవికి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ, వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం శెట్టూరు – కళ్యాణదుర్గం ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఎంపీపీ సోమనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఎంఎస్ హనుమంతరాయుడు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు హరినాథ్ రెడ్డి, తిప్పేస్వామి, సీపీఐ నాయకుడు నరసింహులు, ఎంఆర్‌పీఎస్ నాయకులు గురుమూర్తి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. శెట్టూరు ఎస్సీ వసతి గృహంలో విద్యార్థులకు నూతన మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురాకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే విద్యార్థి హర్షవర్ధన్ బహిర్భూమికి వెళ్లి గోడకూలి ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన తహసీల్దార్ ఈశ్వరమ్మను చుట్టుముట్టారు. ప్రభుత్వ పాఠశాలల పరిశీలనకు వెళ్లకుండా కార్యాలయానికి పరిమితం అవుతున్నారంటూ తహసీల్దార్‌పై మండిపడ్డారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చెవుల కిష్టప్ప, వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల నాయకులు లింగప్ప, నాగేంద్ర, రామాంజినేయులు, బాబురావు, గౌరయ్య, సీపీఐ తిమ్మరాజు, ఎంఆర్‌పీఎస్ నాయకులు వెట్టి తిప్వేస్వామి, బాబు, హరి, రామ్మూర్తి, శివ తదితరులు పాల్గొన్నారు.
నేడు కణేకల్లు క్రాస్‌కు మంత్రి లోకేష్
కణేకల్లు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం కణేకల్లు క్రాస్‌కు రానున్నారు. సుజ్లాన్ కంపెనీకి సంబంధించి 300 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. లోకేష్ పర్యటన సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది.


