అనంతపురం అర్బన్: జిల్లా అంతటా స్వాతంత్య్ర సంబరం అంబరమంటింది. 80వ స్వాతంత్య్ర వేడుకలను శనివారం ఊరూ వాడా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, కార్యాలయాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మికులు, అసంఘటితరంగ కార్మికులు.. ఇలా అన్ని వర్గాల వారూ వేడుకల్లో పాలు పంచుకున్నారు. జాతీయ జెండాను ఎగుర వేసి సెల్యూట్ చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అందరిలోనూ దేశభక్తి ఉప్పొంగింది.
జిల్లాను ప్రగతి పథంలో నడిపిద్దాం..
జిల్లాను అన్ని రంగాల్లోనూ ప్రగతిపథంలో నడిపిద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. శనివారం అనంతపురం నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్య్ర వేడుక నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలకు తన సందేశాన్ని వినిపించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు అభివృద్ధి పనులను రూ.3,850 కోట్లతో చేపట్టామన్నారు. జలహారతి కార్యక్రమం ద్వారా భూగర్భజల మట్టం పెరుగుదలకు, సంరక్షణకు వందరోజుల కార్యాచరణ ప్రారంభించామన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. సమష్టి కృషితో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదామని అధికారులు, సిబ్బందికి సూచించారు. వేడుకలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్, డీఆర్‌ఓ మలోల తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల బాటలో నడవాలి
దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయుల బాటలో అందరూ నడవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్‌కుమార్, డీఆర్‌ఓ మలోల, పరిపాలనాధికారి అలెగ్జాండర్, విభాగాల సూపరింటెండెంట్లు వసంతలత, యుగేశ్వరిదేవి, రియాజుద్ధీన్, ఖజానా శాఖ డీడీ రమణయ్య, డీఎస్‌ఓ శోభారాణి, కలెక్టరేట్, ఖజానా, సర్వే భూరికార్డుల శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
వెల్లివిరిసిన దేశభక్తి
అనంతపురం కల్చరల్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం దేశభక్తిని, సమైక్య భావనను చాటాయి. మంత్రి సందేశం అనంతరం, అధికార, అనధికార ప్రముఖుల సమక్షంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. దేశభక్తి వెల్లివిరిసేలా ‘వందేమాతరం’ అంటూ రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ‘జయహో’ అన్న పాటపై బీకేఎస్ కస్తూర్బా విద్యార్థులు చేసిన నృత్యం ఆకట్టుకుంది. ‘వందేమాతరం.. మా భూమి ఆకాశం అంటూ కేఎస్‌ఆర్ ప్రభుత్వ పాఠశాల బాలికలు నినదిస్తూ మైదానమంతా సందడి చే శారు. ‘కురుగుంట’ విద్యార్థులు నా భారతం, ‘క్రిస్టోస్’ విద్యార్థులు ఒకే ఒక్క దేశం, కూడేరు కేజీబీవీ విద్యార్థులు తెలుగు పల్లె గుండె చప్పుడు అంటూ దేశభక్తి గీతాలతో మరింత ఊపుతెచ్చారు. అలాగే స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులను మంత్రి, అధికారులు సత్కరించారు.
ఊరూ వాడా పంద్రాగస్టు వేడుకలు
మురిసిన మువ్వన్నెల పతాకం
మదినిండా ఉప్పొంగిన దేశభక్తి


