కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం పట్టణంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న మారెమ్మ దేవాలయంలో శుక్రవారం చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయ తాళం పగులగొట్టి 2.5 కేజీల వెండి ఆభరణాలు, ఆరు తాళిబొట్లు, 18 బంగారు గుండ్లను దుండగులు అపహరించారు. శనివారం ఉదయం ఆలయ తలుపులు తెరిచి ఉండడం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిత్యం జన సంచారం ఉండే ప్రధాన రోడ్డు పక్కన ఉన్న ఆలయంలో చోరీ జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి
బెళుగుప్ప: మండల పరిధిలోని ఎర్రగుడి గ్రామానికి చెందిన హరిజన ఆనంద్ (40) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. ఎర్రగుడికి చెందిన ఆనంద్, భార్య సావిత్రితో కలిసి కొన్ని సంవత్సరాల క్రితమే హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. ప్రయివేటు కంపెనీల్లో దినసరి కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని ఆనంద్ పోషించుకుంటున్నాడు. ఇతనికి దివ్యాంగురాలైన కుమార్తె నీరజ, ఇంటర్ చదువుతున్న కుమారుడు ప్రణీత్ ఉన్నారు. వృద్ధులైన తల్లిదండ్రులు కూడా ఆనంద్‌తోనే ఉంటున్నారు. తన భార్య బంధువుల ఇంట ఆది, సోమవారాల్లో శుభకార్యం ఉండటంతో ఇటీవల ఆమెతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. శనివారం ఇంట్లో తాగునీటికి సంబంధించిన మోటారు ఆన్ చేసే సమయంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబానికి జీవనాధారమైన ఆనంద్ మృతి గ్రామంలో తీరని విషాదాన్ని నింపింది. ఆనంద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
భర్తపై కొడవలితో దాడి
విడపనకల్లు: భర్తపై భార్య కొడవలితో దాడి చేసిన సంఘటన విడపనకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. విడపనకల్లు పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన బెస్త అంజినేయులు అలియాస్ చిన్నోడు మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి ఇంటికి వెళ్లేవాడు. దీంతో విసుగెత్తిన భార్య లక్ష్మిదేవి పుట్టింటికి వెళ్లిపోయింది. అంజి ఇకపై మద్యం మానేస్తాడని పెద్ద మనుషులు పంచాయితీ చేయడంతో తిరిగి వచ్చింది. అయితే, ఇటీవల అంజినేయులు తిరిగి మద్యం తాగడం మొదలు పెట్టాడు. భార్యను హింసించేవాడు. శనివారం కూడా మద్యం తాగి వచ్చి ఘర్షణ పడడంతో సహనం కోల్పోయిన లక్ష్మిదేవి కొడవలితో అంజినేయులుపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో
ముగ్గురికి తీవ్ర గాయాలు
తనకల్లు: మండల పరిధిలోని గంగసానివారిపల్లి సమీపంలోని జాతీయ రహదారి–42పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు... అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి సమీపంలోని ఈదులచెరువుకు చెందిన బాలకృష్ణ, రెడ్డెమ్మ, గిరిజలు శనివారం కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కారులో వచ్చారు. దర్శనం అనంతరం స్వగ్రామానికి బయలుదేరారు. గంగసానిపల్లి వద్ద ఓ ఐచర్ వాహనం కారును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న బాలకృష్ణ, రెడ్డెమ్మ, గిరిజకు తీవ్ర గాయాలయ్యాయి. ‘వందేమాతరం’ టీం సభ్యులు తమ అంబులెన్స్‌లో క్షతగాత్రులను తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.


