అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల సమస్యలపై గళమెత్తిన టీచర్లపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలాది మంది ఇన్‌సర్వీస్ టీచర్లకు గుదిబండగా మారిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమస్యను కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీకి వెళ్లిన ఉపాధ్యాయ సంఘాల నాయకులపై.. సంబంధం లేని డీఎస్సీ నియామక ప్రక్రియ అంశాన్ని తెరపైకి తెచ్చి సస్పెన్షన్ వేటు వేయడం ఏమిటని పలువురు టీచర్లు ప్రశ్నిస్తున్నారు.
టెట్ సమస్యపై ఢిల్లీ పర్యటన..
ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు తదితర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ పర్యటనలో పాల్గొన్న వజ్రకరూరు మండలం రాగులపాడు ఎంపీపీఎస్ పీఎస్‌హెచ్‌ఎం, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.అశోక్‌కుమార్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇదే తరహాలో శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రేడ్–2 హెచ్‌ఎం, వైఎస్సార్‌టీఏ రాష్ట్ర ప్రధానకార్యదర్శి షేక్ జంషీద్‌పైనా సస్పెన్షన్ వేటు వేశారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమంలో పాల్గొన్నారన్న అంశాన్ని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.
టీచర్లపైనా ‘రెడ్‌బుక్’ తరహా చర్యలు
ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ‘రెడ్‌బుక్’ తరహా చర్యలు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపైనా, ముఖ్యంగా ఉపాధ్యాయులపైనా ప్రయోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరి టీచర్ల సస్పెన్షన్ వెనుక ఓ ఎమ్మెల్సీ మంత్రాంగం నడిపినట్లు తెలిసింది. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డైరెక్షన్‌లోనే ఈ సస్పెన్షన్లు జరిగాయని ఆరోపణలు విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్జేడీ.. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల విద్యాశాఖ అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో రాత్రికి రాత్రికి ఉత్తర్వులు సిద్ధం చేసి శనివారం వారికి అందజేశారు.
అశోక్‌కుమార్‌రెడ్డిపై
రెండోసారి కక్ష సాధింపు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అశోక్‌కుమార్‌రెడ్డిపై ఇది రెండోసారి సస్పెన్షన్ చర్య. గతంలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి ప్రభుత్వం రెమ్యునరేషన్ పెంచినందుకు హర్షం వ్యక్తం చేసినందుకు అప్పటి డీఈఓ వరలక్ష్మి ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే అప్పటి ఎన్నికల సమయంలో కొందరు ఉపాధ్యాయులు టీడీపీ అభ్యర్థుల ప్రచారాల్లో బహిరంగంగా పాల్గొన్నట్లు వార్తలు వచ్చినా వారిపై కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
సస్పెన్షన్ ఎత్తేయాలి
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలన్న ప్రధాన డిమాండును కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయ సంఘం నేతలను సస్పెండ్ చేయడం దారుణమని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ అనంతపురం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.నాగిరెడ్డి, శ్రీధర్‌గౌడ్ విమర్శించారు. శనివారం సాయంత్రం అనంతపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఉపాధ్యాయ నేతలపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. విద్యా హక్కు చట్టం–2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని, అంతకుముందే ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నిబంధనను వర్తింపజేయడం సహజ న్యాయానికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. అక్రమంగా సస్పెండ్ చేసిన ఉపాధ్యాయుల నుంచి వివరణ తీసుకుని, వారిపై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్‌టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణప్ప, జిల్లా ఉపాధ్యక్షులు విశ్వనాథరెడ్డి, వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి ఓబిరెడ్డి, విశ్వనాథరెడ్డి, రమణారెడ్డి, నారాయణరెడ్డి, సత్యనారాయణరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.
టెట్ సమస్యపై ఢిల్లీకి వెళ్లారని
సస్పెన్షన్ వేటు
సంబంధం లేని డీఎస్సీ అంశాన్ని
అంటగట్టారంటున్న టీచర్లు
ఉమ్మడి జిల్లాలో
ఇద్దరు ఉపాధ్యాయులపై
చర్యలతో విద్యాశాఖలో చర్చ


