విద్యార్థుల వెకిలిచేష్టలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల వెకిలిచేష్టలు

Aug 16 2026 5:09 AM | Updated on Aug 16 2026 5:09 AM

గుమ్మఘట్ట: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో కొంతమంది విద్యార్థులు వెకిలిచేష్టలు చేశారు. రెండు రోజుల క్రితం తెలుగు ఉపాధ్యాయురాలు బోర్డుపై రాస్తుండగా పదో తరగతి విద్యార్థులు కొందరు పేపర్‌ రాకెట్లు విసరడం.. అసభ్యకరంగా డ్యాన్సులు వేయడం చేశారు. దీన్ని గమనించిన ఉపాధ్యాయురాలు వెంటనే హెచ్‌ఎం అబ్బాస్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆ విద్యార్థులను పిలిపించి ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. అయితే విద్యార్థులతో టీచర్‌ కాళ్లు పట్టించారని పలువురు తల్లిదండ్రులు విద్యాశాఖ కార్యదర్శికి మెయిల్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో డిప్యూటీ డీఈఓ లక్ష్మణ్ణ శుక్రవారం క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. తాము ఎవరి కాళ్లూ పట్టుకోలేదని సదరు విద్యార్థులు విచారణాధికారికి రాతపూర్వకంగా తెలియజేశారు.

పీఏబీఆర్‌లోకి

తుంగభద్ర జలాలు

కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్‌లోకి శనివారం సాయంత్రం హెచ్చెల్సీ ద్వారా తుంగభద్ర జలాలు వచ్చి చేరాయి. డ్యాం ఇరిగేషన్‌ డీఈ వెంకటరమణ నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. 100 క్యూసెక్కుల మేర నీరు వస్తున్నట్లు తెలిపారు. డ్యాంలో 1.852 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. తాగునీటి ప్రాజెక్టులకు, లీకేజీ, నీటి ఆవిరి రూపంలో 110 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోందన్నారు. తుంగభద్ర జలాలు వచ్చి చేరుతున్నందున డ్యాంలో రోజురోజుకీ నీటి మట్టం పెరగుతోందన్నారు. ఆయన వెంట జేఈలు సుబ్రమణ్యం, లక్ష్మీదేవి, ఓబులరెడ్డి ఉన్నారు.

హెచ్చెల్సీ గట్టుకు రంధ్రం

కణేకల్లు: కళేకుర్తి బ్రిడ్జి మలుపు వద్ద హెచ్చెల్సీ కుడికాలువ గట్టుకు శుక్రవారం రంధ్రం పడింది. వేదవతి హగరి అక్విడెక్ట్‌ పక్కనే కాలువ గట్టుకు రంధ్రం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి వెంటనే హెచ్చెల్సీ అధికారులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన హెచ్చెల్సీ జేఈ నరేంద్రమారుతి లస్కర్లను ఘటనా స్థలానికి పంపించి రంధ్రాన్ని ఎర్రమట్టితో పూడ్చేయాలని ఆదేశించారు. కాగా జేసీబీలు అందుబాటులో లేని కారణంగా సోమవారం పనులు చేయనున్నట్లు సమాచారం.

తుంగభద్ర జలాశయం.. త్రివర్ణ శోభితం

బొమ్మనహాళ్‌: తుంగభద్ర జలాశయం నిండేందుకు కొద్ది దూరంలో ఉంది. ఈ ఏడాది జలాశయంలో నీటి చేరిక ఆలస్యమైనా ప్రస్తుతం 105.788 టీఎంసీలకు గాను 91.72 టీఎంసీలకు చేరుకుంది. శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్యాం గేట్లకు త్రివర్ణ విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. జలాశయానికి సంబంధించి 33 క్రస్ట్‌గేట్లు ఉండగా ఈ ఏడాది పాత గేట్ల స్ధానంలో కొత్తవి అమర్చిన విషయం తెలిసిందే. దీంతో ఇండిపెండెన్స్‌ సందర్భంగా డ్యాం విద్యుత్‌ కాంతులతో వెలిగిపోయింది. డ్యాంను వీక్షించడానికి పర్యాటకులు తరలివచ్చారు.

కర్షకుడి దేశభక్తి

చిలమత్తూరు: జెండా పండుగ వచ్చిందంటే దేశంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. దేశానికి వెన్నెముక రైతు కాగా ఆ రైతు గుండెల్లో దేశభక్తి వివిధ రూపాల్లో నెలవై ఉంటుంది. చిలమత్తూరు మండల పరిధిలోని కోడూరు సమీపంలో ఉన్న ముద్దప్పపల్లి వద్ద రైతులు పొలం పనుల్లో ఉంటూనే నాగలికి ఓ వైపు జాతీయ జెండా కట్టుకొని, మరోవైపు ఆంజనేయస్వామి జెండా కట్టుకొని దున్నుతూ దేశభక్తి చాటుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement