రాప్తాడు రూరల్: డ్రైవర్‌గా నటిస్తూ వరుసగా కార్లను చోరీ చేసిన నిందితుడిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.40 లక్షల విలువైన ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం రూరల్ ఇన్‌చార్జ్ డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ శ్రీకాంత్ యాదవ్ వివరాలను వెల్లడించారు. అనంతపురం రూరల్ మండలం చియ్యేడుకు చెందిన దూదేకుల హైదర్‌వలి అనంతపురం నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కారు యజమానుల వద్ద డ్రైవర్‌గా పని చేయడంతోపాటు, కొందరి నుంచి అద్దెకు తీసుకుని నడుపుతుండేవాడు. చెడు వ్యసనాలకు అలవాటుపడిన హైదర్‌వలి ఆదాయం సరిపోక అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు కార్లను చోరీ చేసి విక్రయించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల గీతం కళాశాలకు ఎదురుగా ఉన్న బీకేఆర్ హైట్స్ అపార్ట్‌మెంట్ కింద పార్కింగ్‌లో నిలిపి ఉంచిన కార్లను లక్ష్యంగా చేసుకున్నాడు. డ్యాష్‌బోర్డు కింద ఉన్న వైర్లను కలిపి కార్లను స్టార్ట్ చేసి ఒక్కొక్కటిగా చోరీ చేశాడు. మొత్తం ఐదు కార్లను చోరీ చేసి ఆలమూరు–కక్కలపల్లి రహదారి సమీపంలోని ఓ పాడుబడిన షెడ్‌లో దాచాడు. వాటిని కర్ణాటకకు తరలించి విక్రయించాలని భావించాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఓ కారును తీసుకుని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని సమాచారంతో పాడుబడిన షెడ్‌లో దాచిన ఐదు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతపురం రూరల్ డీఎస్పీ పర్యవేక్షణలో నిందితుడిని అరెస్టు చేయడంతోపాటు కార్లను స్వాధీనం చేసుకున్న సీఐ ఎం.శ్రీకాంత్ యాదవ్, ఎస్‌ఐలు ధరణిబాబు, చైతన్య స్వరూపిణి, వారి సిబ్బందిని ఎస్పీ పి.జగదీష్ అభినందించారు.
నిందితుడి అరెస్టు
రూ.40 లక్షల విలువైన ఐదు కార్లు స్వాధీనం


