● నార్పల హైస్కూల్ పూర్వ విద్యార్థుల విన్నపం
అనంతపురం న్యూ టౌన్: నార్పలలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్థలం కబ్జాకు గురి కాకుండా కాపాడాలని పూర్వ విద్యార్థులు కోరారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం పూర్వ విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. 1952లో నార్పల పాఠశాల ఏర్పాటుకు 10.2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. కాలక్రమంలో జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల, సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేశారన్నారు. ఇటీవల పాఠశాల హద్దులను చెరిపేస్తూ పడమటి వైపు 15 నుంచి 20 సెంట్ల మేర పాఠశాల స్థలాన్ని వదిలి ప్రహరీ ఎందుకు నిర్మించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని మరో మారు కొలతలు వేసి హద్దులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఘన చరిత్ర కలిగిన పాఠశాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్రలు పన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రహరీ కోసం వదిలిన స్థలం కనీసం రూ.4 నుంచి రూ. 5 కోట్ల మేర విలువ చేస్తుందన్నారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకొని కబ్జాకు గురి కాకుండా కాపాడాలని కోరారు. అధికారులకు గోడు విన్నవించుకున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్పందించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాలైనా చేసి కాపాడుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పూర్వ విద్యార్థులు చెలిమి ఆదినారాయణ, గవ్వల సుబ్బయ్య, డొక్కా శ్రీధర్, తేరుకాటి అమీర్ భాష, హరి, చంద్రకళ, ఈడిగ కిరణ్, దేవేంద్రనాథ రెడ్డి, మసూద్ వలి, దాదా ఖలందర్, గుజ్జల అదెప్ప, గుత్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


