యల్లనూరు: మండలంలోని దంతలపల్లికి చెందిన భాస్కర్‌రెడ్డి సాగుచేస్తున్న అరటితోటలో కొండ చిలువ కలకలం రేపింది. వివరాలు.. రైతు భాస్కర్‌రెడ్డి తనకున్న రెండు ఎకరాల్లో అరటిచెట్లను సాగు చేస్తున్నాడు. శుక్రవారం రైతు కూలీలతో కలుపు పనులు చేసుకుంటున్న సమయంలో అరటి చెట్ల మధ్య ఉన్న 15 అడుగులున్న కొండచిలువను గుర్తించారు. వెంటనే బిదునంచెర్లకు చెందిన స్నేక్ క్యాచర్ మధుసూదన్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి వచ్చి కొండచిలువను సురక్షితంగా పట్టుకొని జమ్మలమడుగు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. గత ఆరు నెలల్లో మూడు సార్లు కొండచిలువలు కనిపించాయని రైతు భాస్కర్‌రెడ్డి తెలిపారు. అటవీ ప్రాంతం ఆనుకొని పొలం ఉండటంతో తరచూ కొండ చిలువలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.


