దుర్గంలో తాగునీటి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గంలో తాగునీటి కష్టాలు

Aug 8 2026 12:17 AM | Updated on Aug 8 2026 12:17 AM

పట్టించుకోని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, అధికారులు

వారానికోసారి కూడా నీళ్లు రాకపోతే ఎలా అని ప్రజల ఆగ్రహం

రాయదుర్గంటౌన్‌: రక్షిత మంచినీటిని అందజేయడమే తమ లక్ష్యం అంటూ ఒకవైపు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, మరోవైపు మున్సిపల్‌ అధికారుల మాటలు నీళ్లలా పారుతున్నాయే తప్ప.. కొళాయి తిప్పితే చుక్కనీరు రాని దుస్థితి నెలకొంది. రాయదుర్గం పట్టణంలోని ఏ వీధి చూసినా దాహం కేకలే వినిపిస్తున్నాయి.

వారం రోజులుగా ఇబ్బందులు

గత వారం రోజులుగా పట్టణంలో కొళాయిలకు తాగునీటిని సరఫరా చేయడం లేదు. బోరునీటి వసతి, సిస్టన్‌ ట్యాంకులు ఉన్న కాలనీల్లో కనీస అవసరాలకై నా నీరు అందుబాటులో ఉంది. కేవలం కొళాయి నీటిపైనే ఆధారపడి , ఎలాంటి ప్రత్యామ్నాయ నీటి వసతి లేని కాలనీల్లో పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజల నీటి అవసరాలు తీర్చాల్సిన అధికారులు, పాలకులు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. కేవలం మున్సిపాలిటీకి చెందిన రెండు ట్యాంకర్లు, రెండు అద్దె ట్యాంకర్ల ద్వారా బోరునీటిని పంపుతున్నారు. గత గురువారం నుంచి శాంతినగర్‌లోని ట్యాంకర్లను నింపుకునే ఫిల్లింగ్‌ బోరు సైతం మరమ్మతుకు గురవడంతో ట్యాంకర్ల సరఫరా కూడా నిలిచిపోయింది. ఎస్‌ఎస్‌ ట్యాంకులో నీటి పంపింగ్‌ పుల్లింగ్‌ కట్‌ కావడంతో నీటి సరఫరాలో జాప్యం జరిగిందని, సమస్యను శుక్రవారం సాయంత్రం పరిష్కరించి నీటి పంపింగ్‌ ప్రారంభించామని అధికారులు చెబుతున్నారు.

20 రోజులకే నీటి నిల్వలు

రాయదుర్గం పట్టణానికి తాగునీటిని అందించే హెచ్చెల్సీ శాశ్వత తాగునీటి పథకం కింద కణేకల్లులోని ఎస్‌ఎస్‌ ట్యాంకులో కేవలం 20 రోజులకు సరిపడా నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎస్‌ఎస్‌ ట్యాంకు పూర్తిస్థాయి నీటి మట్టం 3052 మిలియన్‌ లీటర్లు కాగా శుక్రవారం నాటికి 380 మిలియన్‌ లీటర్ల నీరు నిల్వ ఉంది. హెచ్చెల్సీ సరిహద్దు నుంచి ఈ నెల 10న ఆంధ్రా కోటా కింద తుంగభద్ర జలాలు విడుదల చేసే అవకాశం ఉంది. అప్పటి దాకా ఎస్‌ఎస్‌ ట్యాంకులో నిల్వ నీటి సామర్థ్యం డెడ్‌ స్టోరేజీకి చేరుకోనుంది. ఎస్‌ఎస్‌ ట్యాంకులో నిల్వ ఉన్న నీరు రంగుమారి సరఫరా అవుతుండడంతో ప్రజలు వినియోగించలేని స్థితిలో ఉన్నారు. ఎస్‌ఎస్‌ ట్యాంకుకు హెచ్చెల్సీ నీటి పంపింగ్‌ ప్రారంభించే వరకు అధికారులు, పాలకులు స్పందించి పట్టణంలో నీటి సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎస్‌ఎస్‌ ట్యాంకులో డెడ్‌ స్టోరేజీకి చేరువలో నీరు

ఇటీవల తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన పట్టణ వాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement