అనంతపురం ఎడ్యుకేషన్: జనాభా గణనలో భాగంగా జిల్లా సెన్సస్ హ్యాండ్‌బుక్ (డీసీహెచ్‌బీ) తయారీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా సెన్సస్ నోడల్ అధికారి మలోలా సంబంధిత అధికారులను ఆదేశించారు. డీసీహెచ్‌బీ తయారీకి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల, బుక్కరాయసముద్రం మండల పరిషత్ కార్యాలయం, రాప్తాడు మండలం సచివాలయం–2లో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలను సందర్శించి శిక్షణ నిర్వహణ, ఫీల్డ్ ఫంక్షనరీలకు అందిస్తున్న మార్గదర్శకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు తమ పరిధిలోని రెవెన్యూ గ్రామాలు, పట్టణాలకు సంబంధించిన జిల్లా సెన్సస్ హ్యాండ్‌బుక్ కోసం క్షేత్రస్థాయి సమాచార సేకరణ చేపట్టాలన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
అనంతపురం సెంట్రల్: నగరంలో త్రీటౌన్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా రేషన్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు త్రీటౌన్ సీఐ కౌలుట్లయ్య తెలిపారు. నగరానికి చెందిన జగదీష్, సాయికృష్ణ రెండు ఆటోల్లో 60 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో స్థానిక శాంతినగర్‌బోర్డు వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఆటోలు, బియ్యాన్ని స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
జిల్లాలోని ముఖ్య ప్రదేశాలపై మై స్టాంప్‌లు
అనంతపురం టౌన్: జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు పర్యాటక ప్రదేశాల వారసత్వ సంపదను కాపాడేందుకు తపాలాశాఖ ఆధ్వర్యంలో మైస్టాంప్‌లను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. తపాలాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మైస్టాంప్‌లను శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలపై స్టాంప్‌లను ఏర్పాటు చేసి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించే దిశగా పోస్టల్ కార్యాలయం వాటిపై స్టాంప్‌లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. జిల్లాలోని 12 ప్రముఖ దేవాలయాలతో పాటు పర్యాటక ప్రదేశాలను ఎంపిక చేసి వాటి చిత్రాలతో స్టాంప్‌లను ఏర్పాటు చేస్తుండటం జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో తపాలాశాఖ సూపరింటెండెంట్ అమర్‌నాథ్, ఏఎస్పీ ఉమా మహేశ్వర్, రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రత్యేక ఉద్యోగాల తుది మెరిట్ జాబితా విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక ఉద్యోగ నియామకాలు 2025–26 కింద రిజర్వ్ చేసిన బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ ప్రక్రియలో భాగంగా ఓడీఎస్సీ పోస్టులకు సంబంధించిన తుది మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకురాలు జి. అర్చన ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్‌సైట్ https://ananthapuramu.ap. gov.in లో మెరిట్ జాబితా ఉంచామన్నారు. అలాగే కలెక్టరేట్‌లోని రికార్డు రూమ్ నోటీస్ బోర్డులో కూడా ఉంచామన్నారు. అలాగే డీఎస్సీ లైబ్రేరియన్ పోస్టుకు సంబంధించిన తుది మెరిట్ జాబితా కలెక్టర్ ఆదేశాల మేరకు కొన్ని అంశాలపై స్పష్టీకరణ ప్రక్రియలో ఉన్నందున, అది పూర్తయిన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తామన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వృద్ధురాలు మృతి
చిలమత్తూరు: మండల పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారి కోడూరు థామస్ మన్రో తోపు సమీపంలోని టెక్స్‌పోర్ట్ గార్మెంట్స్ వద్ద గుర్తు తెలియని కారు ఢీకొని కోడూరు కు చెందిన గంగమ్మ (65) మృతి చెందింది. ఫ్యాక్టరీ వద్ద వాహనాలను గమనించకుండా రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని కారు ఢీకొట్టినట్లు పోలీసులు చెబతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీధర్ తెలిపారు.


