తాడిపత్రి రూరల్ : సోదరుడితో ఉన్న భూతగాదాతో ఏర్పడిన కుటుంబ కలహాల కారణంగా శుక్రవారం చల్లా రామకృష్ణయ్యనాయుడు (61) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని జీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ తెలిపారు. తాడిపత్రి మండలం కావేరిసముద్రం గ్రామానికి చెందిన రామకృష్ణయ్యనాయుడు తాడిపత్రి –చల్లవారిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడ్డాడన్న రైల్వే కో–పైలేట్ సమాచారంతో సంఘటనా స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇగ్నో కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) జూలై–2026 సెషన్‌కు సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తుల గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాలలోని ఇగ్నో అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ మురళీమోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే పీజీ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు రీ–రిజిస్ట్రేషన్ ఫీజును కూడా ఆన్‌లైన్ ద్వారా 15 వరకు చెల్లించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 94404 26895, 98669 24626 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.
‘ఎల్‌నినో’తో అప్రమత్తంగా ఉండాలి
కూడేరు: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని, శాసీ్త్రయ సాగు పద్ధతులను పాటించాలని కృషి విజ్ఞాన కేంద్రం(కళ్యాణదుర్గం) శాస్త్రవేత్తలు వి.యుగంధర్, ఉద్యాన శాస్త్రవేత్త, ఇ.శిరీషా, కీటక శాస్త్రవేత్తలు వింధ్య, డాక్టర్ ఎం.బాంధవ్య సూచించారు. శుక్రవారం కూడేరు మండల పరిధిలోని కొర్రకోడు, తిమ్మాపురం, కూడేరు, గొటుకూరు గ్రామాల్లో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మిరప, టమాట, మొక్కజొన్న, కంది, వేరుశనగ పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు, సలహాలిచ్చారు.


