అనంతపురం: దిశాచట్టాన్ని ఉపసంహరించుకోడం రాష్ట్రంలోని మహిళలందరికీ చీకటి రోజని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి విమర్శించారు. శాంతి భద్రతలు, రక్షణ అంశంలో చంద్రబాబు ప్రభుత్వం బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. దిశ చట్టం రద్దు కావడంతో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా శుక్రవారం అనంతపురంలో డాక్టర్ బాబూ జగజ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అలాగే పోస్టర్లు దగ్ధం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా నాయకులు మాట్లాడుతూ మహిళల రక్షణను చంద్రబాబు ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దిశ చట్టం ద్వారా మహిళలకు అత్యంత పటిష్టమైన , సమగ్ర రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. ఆపదలో ఉన్న మహిళలు వెంటనే సహాయం పొందేలా సాంకేతికతను ఉపయోగిస్తూ దిశ చట్టాన్ని , యాప్‌ను రూపొందించారన్నారు. ప్రస్తుతం ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో మహిళా విభాగం నగర అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ, దాసరి వాసంతి సాహిత్య, దేవి, జాహ్నవి, సుజాతరెడ్డి, సుహాసిని, భారతి, భానుమతి, రాధా యాదవ్, ముంతాజ్, రాజేశ్వరి, ప్రసన్న, లక్ష్మిదేవి, మహేశ్వరి, పార్వతి, ఉష, అంజనమ్మ, అంజలి, పద్మ, లీలా, కుళ్లాయమ్మ, లక్ష్మినరసమ్మ, పద్మావతి, ఖమర్తాజ్, మహేశ్వరి, పద్మా, శోభాభాయి, శోభా రాణి తదితరులు పాల్గొన్నారు.


