అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మొదలైన ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన కరువైంది. ఎల్–నినో వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను గట్టెక్కించడానికి తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ప్రణాళిక రూపకల్పనకు ఈ కార్యక్రమం తలపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం ప్రారంభమైన తొలిరోజే రైతులు నుంచి స్పందన లేదని అధికారులు వాపోతున్నారు. ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు, ఉద్యాన, పశుశాఖ, మత్స్యశాఖ అసిస్టెంట్లు, కమ్యూనిటీ రిసోర్సు పర్సన్లు (సీఆర్‌పీలు), ఆదర్శ రైతులు, అభ్యుదయ రైతులు, ప్రాథమిక వ్యవసామ సహకార సంఘాలకు చెందిన సభ్యులు, అధికారులు, సాగునీటి సంఘం సభ్యులు, మార్కెట్ కమిటీ సభ్యులు... ఇలా గ్రామ స్థాయి నుంచి డివిజన్, జిల్లా స్థాయి వరకు హాజరై గ్రామ గ్రామానా రైతన్నా మీకోసం నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఈ కార్యక్రమానికి రైతుల నుంచి పెద్దగా స్పందన, బలవంతం చేస్తే అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నట్లు గ్రామస్థాయి సిబ్బంది చెబుతున్నారు. దీంతో అధికారులు, సిబ్బంది కూడా అలా పొలాల్లో కొందరు రైతులతో ఫొటోలు తీసుకుని కార్యక్రమాన్ని మమ అనిపిస్తుస్తున్నారు.


