అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌లో లక్షలాది హెక్టార్ల పంటలు సాగులోకి రావాలంటే జూలై వర్షాలు అత్యంత కీలకం. వేరుశనగ, కంది, మొక్కజొన్న, ఆముదం, పత్తి, సజ్జ, కొర్ర తదితర ప్రధాన పంటలు విత్తుకునేందుకు జూలై నెల మంచి అదను. ఆరుద్రతో పాటు పునర్వసు, పుష్యమి లాంటి విత్తన కార్తెలు, ఏరువాక పౌర్ణమి, విత్తనాల ఏకాదశి వంటి శుభగడియలన్నీ దాదాపు కాస్త అటుఇటుగా జూలైలోనే వస్తాయి. 64.3 మి.మీ మేర సాధారణ వర్షపాతం నమోదైతే దాదాపు పంటలన్నీ సాగులోకి వస్తాయి. అలాగే ఏడు నుంచి తొమ్మిది వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావాల్సి ఉంటుంది. అయితే ఈ జూలై పరిస్థితి దారుణంగా తయారైంది. కేవలం 18.8 మి.మీ వర్షం కురిసింది. ఏకంగా 71 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆ 18.8 మి.మీ కూడా గాలివాటం వర్షం కావడం గమనార్హం. కేవలం రెండంటే రెండు మాత్రమే రెయినీడేలు నమోదు కావడం గమనార్హం. అందులో జూలై 19న 4.3 మి.మీ, 21న 5.6 మి.మీ తేలికపాటి సగటు వర్షపు రోజులు నమోదయ్యాయి. గుంతకల్లు, గుత్తి, పెద్దవడుగూరు, యాడికి, ఉరవకొండ, బెళుగుప్ప, గుమ్మఘట్ట, గార్లదిన్నె, శింగనమల, రాప్తాడు తదితర పది పన్నెండు మండలాల్లో మాత్రమే జూలైలో తేలికపాటి వర్షం కురిసింది. మొత్తం మీద ఈ ఖరీఫ్ రెండు నెలల కాలంలో 126.9 మి.మీ గాను 31.1 శాతం లోటుతో 87.4 మి.మీ వర్షం కురిసింది. ఇక ఆగస్టులో 84.4 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉన్నా... కష్టంగానే కనిపిస్తోంది.
ఫలించని పూజలు, యాగాలు
ఎల్–నినో కారణంగా చినుకులు పడటం గగనమైపోయింది. జూన్ 14 వరకు వర్షాల పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత ఎల్–నినో గుప్పిట్లోకి వరుణుడు వెళ్లిపోయాడు. నెలల తరబడి ఎదురుచూసినా పట్టుమని 10 మి.మీ వర్షం కురిసిన దాఖలాలు లేవు. వర్షాల కోసం గ్రామ గ్రామాన రైతులు, ప్రజలు కప్పలు, గాడిదలకు పెళ్లిళ్లు, బొడ్రాళ్లు, గ్రామ దేవతలకు పూజలు, వరుణయాగం, హోమాలు, రామదండు, విరాట పర్వం, సుందరకాండ పారాయణం లాంటి అనేక రూపాల్లో పూజలు చేసినా వరుణుడు కరుణించడం లేదు. జూన్ 15 తర్వాత వర్షాభావం నెలకొనడంతో 32 మండలాల్లోనూ 21 రోజుల మొదటి డ్రైస్పెల్స్ నమోదు కాగా.. 22 మండలాల్లో 30 నుంచి 40 రోజుల సుదీర్ఘ డ్రైస్పెల్స్ నమోదు కావడం గమనార్హం. 3.43 లక్షల హెక్టార్లకు గాను ప్రధానపంటలు 1.15 లక్షల హెక్టార్లకు పరిమితం కాగా... ఇంకా 2.30 లక్షల హెక్టార్ల వరకు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఆగస్టు 15 తర్వాత 40 వేల క్వింటాళ్లు ప్రత్యామ్నాయ విత్తనాలు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. అంతలోపు వర్షం వస్తే ఏ పంట వేసుకోవాలో తెలియక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
జూలై లోటు 71 శాతం
64.3 మి.మీకు గాను 18.8 మి.మీ కురిసిన వర్షం
రెండే రెండు రెయినీడేస్, 22 మండలాల్లో డ్రైస్పెల్స్ రికార్డు
1.15 లక్షల హెక్టార్లకే పరిమితమైన ఖరీఫ్ పంటల సాగు


