రామ్‌నగర్‌లోని అప్పాజీ నిలయం అపార్ట్‌మెంట్ వద్ద నిర్మించిన ట్రాన్స్‌ఫార్మర్ పిల్లర్ ఇది. ఇక్కడ కూడా యజమానే పిల్లర్ ఏర్పాటు చేసుకున్నా దీనికి సైతం ఎస్టిమేషన్‌లో రూ.36 వేలు బిల్లు వేసి మళ్లీ అతడి నుంచి కట్టించుకున్నారు. ఈ రెండే కాదు.. అనంతపురంలో చాలా చోట్ల ఇదే తంతు నడుస్తోంది. భవన యజమానులకు అవగాహన లేకపోవడంతో కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారు.
అనంతపురంలోని మొదటి రోడ్డు రాఘవేంద్రస్వామి గుడి వెనుక భాగంలో గురు నిలయం అపార్ట్‌మెంట్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ పిల్లర్ ఇది. ఈ పిల్లర్ ఏర్పాటు కోసం విద్యుత్ సంస్థకు అపార్ట్‌మెంట్ నిర్వాహకుడు రూ.36 వేలు చెల్లించాడు. పిల్లర్‌ను నిర్మించాల్సిన కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో పిల్లర్ బిల్లును ఎస్టిమేట్‌లో మినహాయించాల్సిన అధికారులు అలాంటిది పట్టించుకోకుండా కాంట్రాక్టర్ బిల్లులో జమ చేశారు. అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది.
అనంతపురం టౌన్: అనంతపురం నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ఇటీవల పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్లు, షాపింగ్‌మాల్స్, కమర్షియల్ భవనాలు వెలుస్తున్నాయి. ప్రతి భవంతి వద్ద విద్యుత్ వినియోగం బట్టి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇందు కోసం విద్యుత్ సంస్థకు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్, పిల్లర్ల నిర్మాణాల కోసం నిర్దేశించిన మొత్తాన్ని యజమానులు ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు పిల్లర్ నిర్మించి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా వాటి నిర్మాణం చేపట్టకుండా భవన యజమానులతోనే ఏర్పాటు చేయించి అ డబ్బు దండుకుంటున్నారు. ఈ రెండేళ్ల కాలంలో నగరంలోని మొదటి, రెండు, నాలుగో రోడ్లతో పాటు కోవూర్‌నగర్, రామ్‌నగర్, లక్ష్మీనగర్, శ్రీనగర్‌కాలనీ, సవేరా ఆసుపత్రి 80 ఫీట్ రోడ్డు, గౌరవ్‌గార్డెన్స్, కళ్యాణదుర్గం రోడ్డు హెచ్‌ఎల్‌సీ కాలనీ ప్రాంతాల్లో ప్రతి అపార్ట్‌మెంట్ నుంచి రూ.36 వేల చొప్పున 200కు పైగా భవనాల యజమానుల నుంచి పిల్లర్ల రూపంలోనే రూ.70 లక్షలకు పైగా దోచేశారనే ఆరోపణలున్నాయి. కొంత మంది విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క వినియోగదారుల నడ్డి విరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించి వినియోగదారుల నుంచి లాగిన డబ్బును తిరిగి వెనక్కు ఇవ్వాల్సి ఉంది.
రికవరీ చేయిస్తాం
పిల్లర్ల నిర్మాణాల కోసం ఎస్టిమేషన్‌లోనే డబ్బు చెల్లించి నిర్మాణాలు సైతం వినియోగదారులే చేపట్టి ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఎలాంటి విచారణ లేకుండానే వారు చెల్లించిన డబ్బు 20 రోజుల్లో రికవరీ చేయిస్తాం. ఏఈలతో వినియోగదారులకు అవగాహన కల్పించి దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం.
– శేషాద్రి శేఖర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ
వినియోగదారుల నడ్డి విరుస్తున్న కాంట్రాక్టర్లు
పిల్లర్ల నిర్మాణానికి ముందే డబ్బు చెల్లించినా మళ్లీ లాగుతున్న వైనం
200కు పైగా పిల్లర్లకు దండుకున్నారనే ఆరోపణలు
‘మామూలు’గా పోతున్న విద్యుత్ శాఖ అధికారులు


