అనంతపురం అర్బన్: యల్లనూరు, వజ్రకరూరు మండలాల్లో జరిగిన అబార్షన్ల ఘటనలపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మొదటి అదనపు జిల్లా జడ్జి సత్యవాణి, పోక్సో కోర్టు జడ్జి చినబాబుతో కలిసి భ్రూణహత్యల నిషేధ చట్టం అమలు కమిటీ జిల్లాస్థాయి సమావేశాన్ని, పీసీ పీఎన్‌డీటీ యాక్ట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిష్పత్తిలో వ్యత్యాసం పెరిగిపోతోందన్నారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా గుర్తించి అవగాహన శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని చెప్పారు. ఇటీవల అబార్షన్లు జరిగిన యల్లనూరు, వజ్రకరూరు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ తర్వాత అబార్షన్లు జరిగి ఉంటే.. బాధ్యులైన స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలన్నారు. భ్రూణహత్యల నిరోధానికి పోలీసు స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) నిఘా సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఏఆర్‌టీ అండ్ సరోగసి యాక్ట్–2021 పటిష్టంగా అమలు చేయాలని పోక్సో కోర్టు జడ్జి చినబాబు ఆదేశించారు. జిల్లాలోని 12 ఏఆర్‌టీ అస్పత్రులను తనిఖీ చేసి ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల నమోదుకు సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయాలని చెప్పారు. అనంతరం వివిధ పోస్టర్లను కలెక్టర్, జడ్జీలు, అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీటీ హెల్త్ డైరెక్టర్ దుర్గేష్, గైనకాలజిస్ట్ సుచిత్ర, రెడ్స్ సంస్థ అధ్యక్షురాలు భానూజా, సీఐ రమేష్, తదితర అధికారులు పాల్గొన్నారు.
ప్రజా ధనమా.. పప్పూబెల్లాలా!
● బాబు బర్త్‌డేకి మున్సిపల్ ఖజానా నుంచి రూ. 4 లక్షల ఖర్చు
అనంతపురం క్రైం: ప్రజా ధనాన్ని పప్పూ బెల్లాల్లా ఖర్చు చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 20న కళారామంలో నిర్వహించిన సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం పేరిట మొత్తం రూ.3,92,249 ఖర్చు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నాలుగు బిల్లులు ఉండగా, ఒకే కార్యక్రమానికి సంబంధించిన పనులను కావాలనే విడదీసి చిన్న బిల్లులుగా తయారు చేశారనే అనుమానాలున్నాయి. వీటిలో ఒక బిల్లు మొత్తం రూ.96,996, రెండోది రూ.99,255, మూడోది రూ.96,996, నాలుగోది రూ.99,002గా ఉండడం గమనార్హం. 600 కుర్చీలు, 16 టేబుళ్లు, 8 పైలాన్ స్టోన్స్, పూల అలంకరణ, 3,250 చదరపు అడుగుల గ్రీన్ మ్యాట్, సౌండ్ సిస్టమ్, షామియానాలు, జేసీబీ, ట్రాక్టర్, తాగునీటి క్యాన్లు, నీటి సీసాలు, పూల కుండీలు, పైలాన్ ఫ్రేమ్ వంటి వాటికి చెల్లింపులు చూపించారు. ఒక్క అనంతపురంలోనే రూ.4 లక్షలు బాబు బర్త్‌డేకి ఖర్చు చేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా లెక్కిస్తే కోట్ల రూపాయల్లో ఉంటుందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రజా ధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తుండడంపై మండిపడుతున్నారు.


