స్వాములకే శఠగోపం | - | Sakshi
Sakshi News home page

స్వాములకే శఠగోపం

Aug 2 2026 1:40 AM | Updated on Aug 2 2026 1:40 AM

ఆలయ ఆదాయం మాయం

కీలక అధికారి తీరుపై అనుమానాలు

గూగూడు జంట దేవాలయాల్లో దుస్థితి

నార్పల : దేవదాయ శాఖలో అవినీతి రాజ్యమేలు తోంది. ఆలయ ఆదాయానికే కన్నం వేస్తున్నారు. స్వాములకే శఠగోపం పెడుతున్నారు. గూగూడులోని ప్రసిద్ధ కుళ్లాయిస్వామి– ఆంజనేయస్వామి జంట ఆలయాల్లో జరుగుతున్న గోల్‌మాల్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. మొహర్రం ఉత్సవాలకు గూగూడు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ కుళ్లాయిస్వామితో పాటు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. గత ఏడాది మొహర్రం ఉత్సవాల సమయంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపు వ్యవహారం గందరగోళానికి దారితీసింది. రెండు ఆలయాల్లోని హుండీల కానుకలను లెక్కించినట్లు అప్పటి ఆలయ కీలక అధికారి తెలిపారు. అయితే సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాలకు.. అధికారి మాటలకు పొంతన కుదరడం లేదు. ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన రెండు కానుకల సంచులు, ఒక హుండీ మాత్రమే కనిపిస్తున్నాయి. కుళ్లాయిస్వామి ఆలయంలోని పసుపురంగు హుండీ బరువుగా ఉందని కానుకలను ఒక సంచిలోకి వేసుకొచ్చి లెక్కించినట్లు చెబుతున్నట్లుగా అక్కడ లేదు. కుళ్లాయిస్వామి ఆలయం నుంచి బయటకు వచ్చిన కానుకల సంచి.. లెక్కింపు ప్రదేశంలో కనిపించకపోవడాన్ని గమనిస్తే ఆ సంచి మిస్సింగ్‌ అయినట్లు స్పష్టమవుతోంది.

బ్యాంకు ఖాతాలకూ కన్నమే!

భక్తుల కానుకలతో పాటు స్వామివారి బ్యాంకు ఖాతాలకూ కన్నం పడుతోంది. గూగూడు కుళ్లాయిస్వామి ఆలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కాంట్రాక్టర్‌ ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు. కానీ గడిచిన మూడేళ్లుగా తద్విరుద్ధంగా జరుగుతోంది. ఆలయ కీలక అధికారి చేతివాటమే ఇందుకు కారణం. ఉద్యోగుల పేరు మీద లక్షలాది రూపాయలు డ్రా చేశారు. ఇక ఆంజనేయస్వామి ఆలయ బ్యాంక్‌ ఖాతా నుంచి ఏ విధమైన పనులకూ నగదు డ్రా చేయరాదు. కానీ ఈ అంకౌట్‌ నుంచి కూడా రూ.లక్షల్లోనే యథేచ్ఛగా డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జంట దేవాలయాల కానుకలు, డబ్బుకు పటిష్ట భద్రత కల్పించాలని, ఇప్పటి వరకు జరిగిన గోల్‌మాల్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement