పంటలు ఎండుతున్నా పట్టించుకోరా? | - | Sakshi
Sakshi News home page

పంటలు ఎండుతున్నా పట్టించుకోరా?

Aug 2 2026 1:40 AM | Updated on Aug 2 2026 1:40 AM

కూడేరు: విద్యుత్‌ సరఫరాలో అంతరాయంతో మోటార్లు ఆడక.. నీరందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆగ్రహించారు. వ్యవసాయానికి నిర్దేశించిన సమయం మేర విద్యుత్‌ సరఫరా చేయాలని శనివారం మరుట్ల –1, 2, 3 కాలనీలకు చెందిన రైతులు మరుట్ల–2 కాలనీలో ఉన్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. సిబ్బందిని స్టేషన్‌ నుంచి బయటకు పంపించేశారు. ఆవరణలోనే వంటావార్పు చేపట్టి.. నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఏడీ రవి శంకర్‌, ఏఈ గౌస్‌ ఆందోళనకారుల వద్దకు వచ్చి చర్చించారు. తరచూ బ్రేక్‌ డౌన్‌ అవుతుండడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతోందని రైతులు తెలిపారు. పగలు 3 గంటలు, రాత్రి పూట 4 గంటలు చొప్పున వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా చేస్తామని అధికారులు చెప్పినా.. అరగంటకొకసారి సరఫరా ఆగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటర్లు పని చేయక.. పంటలకు నీరందక కళ్లెదుటే ఎండిపోతున్నాయని మండిపడ్డారు. లైన్‌మెన్‌ లేకపోవడంతో విద్యుత్‌ సమస్యలపై స్పందించేవారే కరువయ్యారన్నారు. స్థానిక సిబ్బంది ఏదైనా సమస్య వస్తే ప్రైవేటు వ్యక్తులను పంపుతారని, వారేమో రూ.500 నుంచి రూ.1000 వరకు డిమాండ్‌ చేస్తున్నారని వాపోయారు. సమస్య తలెత్తిన ప్రతిసారీ రూ.వందల్లో డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడినుంచి తేవాలని ప్రశ్నించారు. వ్యవసాయ మోటర్లకు 9 గంటలు పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని, లైన్‌మెన్‌ను నియమించాలని డిమాండ్‌ చేశారు. కేటాయింపు మేరకు సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు చర్యలు చేపడతామని ఏడీ, ఏఈ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

విద్యుత్‌ సరఫరా అంతరాయంపై మరుట్ల కాలనీల రైతుల కన్నెర్ర

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడి.. అక్కడే వంటావార్పుతో నిరసన

నాణ్యమైన విద్యుత్‌ అందించాలని రైతుల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement