కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లోకి ఇన్ ఫ్లో లేక నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. గురువారం నాటికి జలాశయంలో 1.9 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. డ్యాం ఎగువ ప్రాంతాల్లో వర్షం బాగా కురిస్తే వరద రూపంలో నీరు వచ్చి డ్యాంలో చేరేది. కానీ వర్షా కాలమైనప్పటికీ వర్షాలే కురవలేదు. డ్యాంలో ఏర్పాటైన ఉమ్మడి అనంతపురం జిల్లాలకు చెందిన తాగునీటి ప్రాజెక్టులకు 55 క్యూసెక్కులు, లీకేజీ, నీటి ఆవిరి రూపంలో మరో 75 క్యూసెక్కుల నీరు రోజు బయటకు వెళ్లి పోతోంది. ఇన్‌ఫ్లో లేక అవుట్ ప్లో మాత్రమే ఉండడంతో రోజురోజుకీ నీటి మట్టం తగ్గిపోతోంది. ఇలానే కొనసాగితే తాగునీటి ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పాడే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
దేవదాయశాఖ సహాయ కమిషనర్‌గా సుధారాణి
అనంతపురం కల్చరల్: జిల్లా దేవదాయశాఖ సహాయ కమిషనర్‌గా సుధారాణి గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన మల్లికార్జున ప్రసాద్ స్థానంలో ఇన్‌చార్జిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. సుధారాణి మాట్లాడుతూ శాఖాపరంగా ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతకు ముందు ఎండోమెంటు సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు.
రిటైర్డ్ ఆర్‌ఎస్‌ఐపై సీఐ దాడి
అనంతపురం సెంట్రల్: రిటైర్డ్ ఆర్‌ఎస్‌ఐపై సీఐ దాడి చేసిన ఘటన గురువారం అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. బాధితుడు రామకృష్ణ వివరాల మేరకు.. అనంతపురంలోని కార్తికేయ రెసిడెన్సీలో పోలీసుశాఖలో ఏఆర్ విభాగంలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఆర్‌ఎస్‌ఐ రామకృష్ణ నివాసముంటున్నారు. ఆయన ఇంటికి ఎదురుగా వీఆర్‌లో ఉన్న సీఐ దేవానందం ఉంటున్నారు. సీఐ దేవానందం వంట గది కిటికీ ఆర్‌ఎస్‌ఐ రామకృష్ణ ఇంటి వైపు ఉంది. దీంతో వంట చేసిన సమయంలో పొగ మొత్తం రామకృష్ణ ఇంటి వైపు వస్తోంది. అప్పటికే ఆయన గుండెకు సంబంధిత ఆపరేషన్ చేయించుకోవడంతో ఇబ్బంది కలుగుతోందని, వంట చేసే సమయంలో కిటికీ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెడచెవిన పెట్టడంతో పాటు పరుష పదజాలంలో మాట్లాడడంతో రెండురోజుల క్రితం నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఒకే డిపార్ట్‌మెంట్ అధికారి కావడంతో కేసు నమోదు చేయలేదు. ఈ విషయం సదరు సీఐ దేవానందంకు తెలియడంతో గురువారం ఉదయం ఇరువురు గొడవకు దిగారు. సీఐ దేవానందం లాఠీతో దాడి చేయడంతో ఆర్‌ఎస్‌ఐ రామకృష్ణ చేతికి తీవ్రంగా గాయమైంది. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగడం లేదని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తనపైనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతానని బెదిరిస్తున్నట్లు వాపోయారు. ఎస్పీ, డీఐజీ స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
చోరీ కేసు ఛేదించిన పోలీసులు
డీ.హీరేహాళ్ (బొమ్మనహాళ్): డీ.హీరేహాళ్ మండలంలోని మల్లికేతిలో ఇటీవల జరిగిన ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి వివరాల మేరకు.. మల్లికేతికి చెందిన ఆదిమూర్తి ఇంట్లో రెండు రోజుల క్రితం రూ. 21,500 నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా సమాచారం మేరకు గురువారం ఉదయం మల్లికేతి గేటు వద్ద అదే గ్రామానికి చెందిన నాగార్జునను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుంచి చోరీ సొమ్ములో రూ.19,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


