అనంతపురం అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల డిమాండ్లను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఫ్యాప్టో నాయకులు ధ్వజమెత్తారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని గేటు ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ శ్రీనివాసులు నాయక్, ప్రధాన కార్యదర్శి పురుషోత్తం మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఇప్పటికీ కనీసం పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేయలేదని, ఐఆర్ ఉసే లేదని మండిపడ్డారు. 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. మధ్యంతర భృతి 30 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు నిర్వహించే ప్రత్యేక టెట్‌లో ఉత్తీర్ణత మార్కులు ఒకే విధంగా ఉండాలన్నారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. కలెక్టర్ పూల్ ద్వారా పోస్టింగ్‌లు ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు అప్పగించరాదన్నారు. మునిసిపల్ టీచర్ల పీఎఫ్ సమస్య పరిష్కరించాలన్నారు. సమస్యలన్నీ పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్‌ఓ ఎ.మలోలకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నాయకులు అందజేశారు. ధర్నాలో ప్రభుత్వ పెన్షన్లీర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెద్దన్నగౌడ్, శీల జయరామప్ప పాల్గొని సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సంఘం కో–చైర్మన్లు ఓబుళేసు, తింగ మూర్తి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు వెంకటరత్నం, అక్కులప్ప, ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర కార్యదర్శులు సూర్యుడు, వెంకటసుబ్బయ్య, పాతిరెడ్డి, రాజశేఖర్, ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు గోపాల్‌రెడ్డి, రామాంజనేయులు, హనుమప్ప, రవీంద్ర, వెంకటరెడ్డి, లింగమయ్య, నాయకులు కోటేశ్వరప్ప, రమణారెడ్డి, మోహన్‌రెడ్డి, హబీబూల్ రెహమాన్, ఈశ్వ రయ్య, నరేష్, మంజుల, రమణయ్య, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


