అనంతపురం అర్బన్: ‘‘చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విద్యార్థుల చేతుల్లో బొచ్చె పెట్టింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తామని చెప్పి మాట తప్పిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులు భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు’’ అంటూ ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ధ్వజమెత్తారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు మంగళవారం కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించారు. పేపర్ ప్లేట్లు చేతిలో పెట్టుకుని అర్ధనగ్నంగా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి, మంత్రి లోకేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతనాయుడు, ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామని చెప్పిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట తప్పారని విమర్శించారు. రెండేళ్లైనా బకాయిలు విడుదల చేయకుండా పేద విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. ఫీజుల కోసం కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తుంటే ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని దుయ్యబట్టారు. పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.6,400 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. పీజీ విద్యార్థుల ఉన్నత విద్యకు అడ్డంకిగా మారిన జీఓ 77 రద్దు చేయాలన్నారు. అనంతరం డీఆర్‌ఓ ఎ.మలోలను ఆయన చాంబర్‌లో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, నరసింహయాదవ్, వెంకట్ నాయక్, వంశీ, మంజు, చందు, ఉమామహేష్, నవీన్, పవన్ పాల్గొన్నారు.


