230 పోయి 19 పోస్టులు మిగిలాయి!
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ పదోన్నతుల టీచర్లకు తీరని అన్యాయం చేశారంటూ టీచర్లు వాపోయారు. 117 జీఓ ఆధారంగా వచ్చిన 230 ఇంగ్లిష్ పదోన్నతుల పోస్టులు ఇప్పుడు కేవలం 19 మాత్రమే మిగులుగా చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. బుధవారం స్థానిక శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో నిరసన తెలియజేశారు. విద్యా శాఖ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఈఓ చాంబరును ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే రెండేళ్ల సర్వీస్ కోల్పోయి నష్టపోయామని, 27 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండి ఒక్క ప్రమోషన్ కూడా లేకుండానే రిటైర్డ్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డీఓఈ ప్రసాద్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీచర్లు జి.సూర్యుడు, రామాంజినేయులు, చంద్రశేఖర్, శ్రీనివాస నాయక్, జయరాం నాయక్, గోపాల్ రెడ్డి, శంకరమూర్తి, కేశవరెడ్డి, ఓబులేసు, లక్ష్మీనారాయణ, ధనలక్ష్మి, విజయ శ్రీ, నరసింహులు, ఓబిరెడ్డి, సూర్యనారాయణ, రసూల్ పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు ఎస్.నాగిరెడ్డి, జి.శ్రీధర్‌గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రవీంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణ, రాష్ట్ర కౌన్సిలర్ గోపాల్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన్ మద్దతు తెలిపారు.


