రిజిస్ట్రేషన్లు డీలా
జీవితంలో సొంతిళ్లు లేదా రెండు సెంట్ల స్థలాన్ని కొనుక్కోవాలన్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ఆశలను కూటమి ప్రభుత్వం చిదిమేసింది. ప్రభుత్వం మారినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూటమి నాయకుల ఆక్రమణలు, భూకబ్జాలు, గొడవలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు డీలా పడ్డాయి. వార్షిక లక్ష్యానికి దరిదాపుల్లో కూడా లేని దుస్థితి నెలకొంది.
● 68 శాతంతోనే ఆగిపోయిన జిల్లా రిజిస్ట్రేషన్ల ఆదాయం
● వార్షిక లక్ష్యం దరిదాపుల్లో కూడా లేని దుస్థితి
● గడిచిన 30 ఏళ్లలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదన్న అధికారులు
● నాయకుల బెదిరింపులు, ఆక్రమణలతో ముందుకురాని కొనుగోలుదారులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: నాలుగు ప్లాట్‌లు కొని పెట్టుబడి పెట్టుకుందామని అనుకునే సగటు వేతన జీవులు హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఖాళీ జాగా కనిపిస్తేనే చాలు కూటమి నాయకులు కబ్జా చేస్తున్నారు. దీంతో స్థిరాస్తి పెట్టుబడి పెట్టడం వద్దనుకుని చాలా మంది బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటున్నారు. దీంతో అనంతపురం జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చే ఆదాయం గతంలో ఎప్పుడూ లేని విధంగా తగ్గిపోయింది. నిర్ణయించిన లక్ష్యానికి చేరువ కాలేక పోయారు.
68% దగ్గరే ఆగిపోయిన ఆదాయం
జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ప్రభుత్వానికి రూ.469.65 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మేలో ఎన్నికలు జరిగాయి. జూన్ 12న కూటమి సర్కారు కొలువుదీరింది. అక్కడి నుంచే మొదలైంది రివర్స్ పాలన. 2024 జూన్ 12 మొదలు నేటికీ రిజిస్ట్రేషన్లు ఊపందుకోలేదు. ఎమ్మెల్యేల దందాలు, కబ్జాలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఖాళీ స్థలాలు, అప్పటికే నిర్మాణం పూర్తయిన అపార్ట్‌మెంట్లు ఒక్కసారిగా కొనుగోళ్లు లేక చతికిలపడ్డాయి. గతంలో ఎప్పుడూ 80 శాతానికి పైగా వసూళ్లు వచ్చేవి. కానీ కేవలం 68 శాతం మాత్రమే ఈ ఏడాది వసూళ్లయ్యాయంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అంచనా వేయొచ్చు.
రాప్తాడులో తమ్ముళ్ల దెబ్బకు..
అనంతపురం జిల్లాలో చాలావరకు రాప్తాడు నియోజకవర్గ పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ టీడీపీ నాయకుల దెబ్బకు స్థిరాస్తి రంగం కుదేలైంది. ఎక్కడ వెంచర్లు వేసినా వసూళ్ల కోసం కూటమి నాయకులు గద్దల్లా వాలిపోతున్నారు. మొన్నటికిమొన్న హంపాపురం దగ్గర ఏకంగా జేసీబీలనే పనిచేయకుండా ఆపేశారు. సవేరా హాస్పిటల్ దగ్గర బిల్డర్లను బెదిరించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ చూసినా భూఆక్రమణలు, బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. దీంతో ఎవరైనా కొత్తగా వెంచర్లు వేయాలంటేనే భయపడుతున్నారు.
రిజిస్ట్రేషన్లు డీలా


