రైల్వే స్టేషన్‌లో విస్తృత తనిఖీలు
తాడిపత్రి టౌన్: రైళ్లలో గంజాయి, అక్రమ మద్యం రవాణాను అరికట్టే దిశగా పోలీసులు గురువారం తెల్లవారుజామున తాడిపత్రి రైల్వే స్టేషన్‌లో విస్తృత తనిఖీలు చేపట్టారు. స్థానిక సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐ గౌస్‌బాషా నేతృత్వంలో జిల్లా కేంద్రం నుంచి స్నిప్పర్ డాగ్‌తో పాటు వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం తనిఖీలు కొనసాగించారు.
బాలుడి ఆత్మహత్యాయత్నం
గుత్తి రూరల్: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం కొత్తబురుజు గ్రామానికి చెందిన ఓ బాలుడు గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తమ మాట వినకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్న కుమారుడిని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన బాలుడు గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషపూరిత ద్రావకం తాగాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు.. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడిని గమనించి వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తరలించారు. ఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


