ప్రాణం తీసిన ప్రచార యావ | Man Died Due To Electrocution While Installing Flexi In TDP MLA Candidate Bandaru Sravani Campaign - Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ప్రచార యావ

Feb 29 2024 7:16 PM | Updated on Feb 29 2024 7:16 PM

- - Sakshi

శింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి ప్రచార యావ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.

అనంతపురం: శింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి ప్రచార యావ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంటి పెద్ద దిక్కు మృతితో భార్య, నలుగురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. తన ఇంటి వద్దకు పని నిమిత్తం వచ్చిన ఓ అభాగ్యుడు చనిపోతే, కనీసం అతడి కుటుంబ సభ్యులను శ్రావణి పరామర్శించకపోవడం విమర్శలకు తావిచ్చింది. వివరాలు.. శింగనమల నియోజకవర్గ టీడీపీ టికెట్‌ను బండారు శ్రావణి శ్రీ దక్కించుకున్నారు. దీంతో అనంతపురం నగరంలోని అరవింద నగర్‌లో ఉన్న ఆమె ఇంటి వద్ద భారీ కటౌట్‌లు, ఫ్లెక్సీలు కట్టాలని నిర్ణయించారు. బండారు శ్రావణి అనుచరులు రాజు, మేదర కాకర్ల దుర్గన్నకు పని అప్పగించారు. వీరు ఆ పని నిమిత్తం మరువకొమ్మ కాలనీకి చెందిన కూలీ సాకే రాజు(40)ను ఆశ్రయించారు. ‘నాకు ఆరోగ్యం బాగోలేదు. రాలేను, పైగా శ్రావణి ఇంటి పైనే 11 కేవీ లైన్‌ వెళ్తుంది. అక్కడ కటౌట్‌లు కడితే ప్రమాదం’ అని రాజు చెప్పినా వినకుండా ఎలాగైనా రావాలి అంటూ పురమాయించారు. ఈ క్రమంలోనే సాకే రాజు, మరో వ్యక్తి సలీంతో కలిసి బుధవారం శ్రావణి ఇంటి వద్దకు వచ్చి పొడవాటి కట్టెలు నాటాడు. కటౌట్‌ కట్టేందుకు శ్రావణి ఇంటి పైకి వెళ్లాడు. ఈ క్రమంలోనే 11 కేవీ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనలో సలీం కూడా గాయపడ్డాడు. సాకే రాజు మృతి చెందాక కనీసం కుటుంబీకులకు సైతం టీడీపీ నాయకులు తెలియజేయలేదు. మృతదేహాన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనంలో ఎక్కించి సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. మార్చురీ వద్ద రాజుకు తెలిసిన వ్యక్తి ఉంటే చెప్పారు. ఆయన ఇచ్చిన సమాచారంతో రాజు భార్య లక్ష్మీదేవి తన నలుగురు పిల్లలతో ఆస్పత్రికి హుటాహుటిన చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి గుండెలవిసేలా రోదించారు. ఇక తమకు దిక్కెవరయ్యా అంటూ భార్య విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

కఠినంగా శిక్షించాలి..

తన భర్త ముందే హెచ్చరించినా, పనికి తీసుకెళ్లి ప్రాణాలు తీశారని సాకే రాజు భార్య లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. బండారు శ్రావణి, ఆమె అనుచరులు రాజు, మేదర కాకర్ల దుర్గన్నలు బాధ్యత వహించాలన్నారు.నిందితులను కఠినంగా శిక్షించాలని అనంతపురం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రమాదం అని తెలిసినా..

తన ఇంటిపై భారీ విద్యుత్‌ లైను వెళ్తోందని తెలిసినా.. శ్రావణి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి మృతికి కారణమయ్యారని పలువురు విమర్శించారు. కనీసం మృతుడి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించకపోవడాన్ని తప్పుబట్టారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

శింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి ఇంటి వద్ద వ్యక్తి దుర్మరణం

మరో వ్యక్తికి గాయాలు

ఫ్లెక్సీలు కట్టే క్రమంలో

విద్యుదాఘాతంతో ఘోరం

ఆరోగ్యం బాగో లేదంటున్నా

బలవంతంగా తీసుకెళ్లిన వైనం

ఇంటి పెద్ద దిక్కు మృతితో

దిక్కులేనివారైన భార్య, నలుగురు పిల్లలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement