ముగిసిన ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు
కదిరి: ఖాద్రీశుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన పుష్పయాగోత్సవం కమనీయంగా సాగింది. పుష్పయాగోత్సవంతో పక్షం రోజుల పాటు సాగిన ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగేందుకు సహకరించిన అష్ట దిక్పాలకులు, పంచ భూతాలు, దేవతా మూర్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని..సాగనంపడమే పుష్పయాగోత్సవ ఉద్దేశమని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు వివరించారు.
మధ్యాహ్నం తర్వాత దర్శనం
తీర్థవాది ఉత్సవం ముగియగానే అర్చకులు గురువారం సాయంత్రం ఆలయం తలుపులు మూసివేశారు. శుక్రవారం ఆలయ ద్వారాలు తెరిచి మహా సంప్రోక్షణ చేశారు. అనంతరం స్వామివారికి నిత్య పూజాది కై ంకర్యాలను నిర్వహించిన మీదట భక్తులను ఆలయంలోకి అనుమతించి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. శుక్రవారం రాత్రి రంగమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని బెంగళూరు నుంచి తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఈ ఉత్సవానికి ఉభయ దారులుగా విశ్రాంత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పూల అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు.


