ములకలచెరువు : అన్నమయ్య జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతులంతా అనంతపురం వాసులు. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ములకలచెరువు ఎస్‌ఐ ప్రతాప్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురానికి చెందిన ఆదిలక్ష్మి(62) పక్షవాతంతో బాధపడుతోంది. ఈమెకు చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద విరూపాక్షిపురంలో పక్షవాతానికి మందు ఇప్పించేందు కోసం కుటుంబ సభ్యులు మురళి, వనజాక్షి (40) శుక్రవారం తెల్లవారుజామున ఖాదర్‌వలి కారులో బయల్దేరారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం గొడ్డావులకోట వద్దకు రాగానే టమాట క్రేట్లతో ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం వీరి కారును వేగంగా ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న ఖాదర్‌వలి, ఆదిలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. బొలేరో వాహనం డ్రైవర్ బాలాజీ నాయక్, మురళి, వనజాక్షి(40)లకు తీవ్ర గాయాలయ్యాయి. అటువైపు వెళ్లే ప్రయాణికులు గమనించి అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు చేరుకున్న 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో వనజాక్షి పరిస్థితి విషమించి అదేరోజు రాత్రి మృతి చెందింది.


