అనంతపురం టవర్‌క్లాక్: రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ కోరారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, సీ్త్ర శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య, జెడ్పీ స్థాయీ సంఘం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
16 నుంచి
ఒంటిపూట బడులు
● ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు
అనంతపురం ఎడ్యుకేషన్: వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. రోజూ ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే రోజుల్లో తరగతులు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు పెట్టుకోవాలన్నారు. పరీక్షలు లేనిరోజుల్లో మాత్రం సాధారణంగా ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఉపాధ్యాయులు ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఉదయం 7.45లోపు ఇన్–టైమ్, మధ్యాహ్నం 12.30 తర్వాత అవుట్–టైమ్ నమోదు చేయాలని డైరెక్టర్ సూచించారు. ఒంటిపూట బడుల అమలులో ఉన్న సమయంలో హాఫ్ డే క్యాజువల్ లీవ్ అనుమతించరాదని స్పష్టం చేశారు. ఇక పదో తరగతి పరీక్షల డ్యూటీకి వెళ్లే టీచర్లు అటెండెన్స్ యాప్‌లో ‘పదో తరగతి డ్యూటీ’గా నమోదు చేయాలని, పరీక్షలు లేని రోజుల్లో తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని అధికారులు సూచించారు.


