● గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేయాలి
● అధికారులకు జేసీ విష్ణుచరణ్ ఆదేశం
● ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్ రూమ్– 85002 92992
అనంతపురం అర్బన్: వంట గ్యాస్ సరఫరాలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందీ కలగకూడదని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్యాస్ డెలివరీ సమయంలో ఏవైనా సమస్యలు వస్తే వినియోదారుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ 85002 92992 ఏర్పాటు చేశామన్నారు. డొమెస్టిక్ (గృహావసరాల) గ్యాస్ సిలిండర్ల సరఫరాపై జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గ్యాస్ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు బల్క్ స్టాక్ తెప్పించుకోవాలని ఆదేశించారు. ఏజెన్సీలు తమ వద్ద సిలిండర్ వివరాలను రోజూ ఉదయం ఎనిమిది గంటలకు ఒకసారి, తిరిగి సాయంత్రం 4 గంటలకు మరోసారి పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. అత్యవసర రంగాలకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకం, ఆస్పత్రులు, తదితర వాటికి ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందించాలని ఆధికారులను ఆదేశించారు.
అవసరం ఉంటే నే బుక్ చేయాలి
గ్యాస్ వినియోగదారులు అవసరం ఉంటేనే సిలిండర్ బుక్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ చెప్పారు. అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడం సరికాదన్నారు. సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల వ్యవధి, డబుల్ సిలిండర్ ఉన్నవారు 30 రోజుల వ్యవధిలో మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలన్నారు. సిలిండర్ డెలివరీ క్రమంలో ఏవైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ 85002 92992 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.


